మూఢ‌న‌మ్మ‌కాల‌పై స్వ‌చ్ఛంద సంస్థ యుద్ధం

మూఢ‌న‌మ్మ‌కాల‌ను తొల‌గించేందుకు ఓ స్వ‌చ్ఛంద సంస్థ మ‌హారాష్ట్రలో చేస్తున్న సేవ‌ల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింది. మ‌హారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ద‌వా దూ

  • Publish Date - March 29, 2024 / 05:30 PM IST

ద‌వా దూ, మాన‌స్ రంగ్ పేరుతో ప్ర‌జ‌ల‌కు ఉచిత చికిత్స‌

విధాత‌: మూఢ‌న‌మ్మ‌కాల‌ను తొల‌గించేందుకు ఓ స్వ‌చ్ఛంద సంస్థ మ‌హారాష్ట్రలో చేస్తున్న సేవ‌ల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింది. మ‌హారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ద‌వా దూ(మందులు ఇవ్వాల) అనే పేరుతో ప్ర‌జ‌ల‌కు ఉచిత చికిత్స అందిస్తున్న‌ది. మాతృభూమి ఫౌండేష‌న్‌, ప‌రివ‌ర్త‌న్ ట్ర‌స్ట్‌తో క‌లిసి ద‌వా దూ అనే సంస్థ ప‌ని చేస్తున్న‌ది. ప్ర‌జ‌ల్లో మూఢ‌న‌మ్మ‌కాన్ని తొల‌గిస్తూ, శాస్త్రీయ ప‌ద్ద‌తుల్లో చికిత్స‌ను అందిస్తున్న‌ది. ఈ సంస్థ కొత్తగా మాన‌స్ రంగ్ అనే కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టింది. ఈ ప్రాజెక్టులో మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి చికిత్స అందిస్తున్నారు. అన‌వ‌స‌ర‌మైన భ‌య‌ము, చిన్న‌చిన్న‌వాటికే ఉత్తేజ‌ప‌డ‌టం, మంద‌బుద్ధి వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌వారికి మాన‌స్ రంగ్ వేదిక కింద వైద్యం అందించి, వారిని తిరిగి మామూలు స్థాయికి తీసుకొచ్చి వారిలో ఆత్మ‌విశ్వాసం పెంపొందిస్తున్నారు.

ద‌వా దూ అనే కార్య‌క్ర‌మం ప్ర‌స్థుతం ప్ర‌జ‌ల్లో బాగా ఆద‌ర‌ణ పొందింది. రోజు త‌ప్పించి రోజు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు తదితర అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఓపిడి విభాగంలో డాక్టర్లను కలిసి సంప్రదింపులు, సలహాల ద్వారా చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ప్రజల విశ్వాసాలను చూరగొని, వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను దూరం చేస్తున్నారు. ఇదంతా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సైలని బాబా దర్గా ట్రస్ట్ ఆఫీస్ పరిసరాల్లో అమలవుతున్నది. సమస్యలు ఉన్నవారు గుంపులుగా వ‌చ్చి చికిత్స తీసుకుంటూన్నారు. ఏడాదిన్న‌ర‌గా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఓపీడీ (అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్) విభాగంలో దాదాపు 1000 మంది పేషెంట్లు చికిత్స పొందారని, వైద్యుల‌ సలహాలు, మందులను, తీసుకొని తమ సమస్యల నుంచి బయటపడ్డారని, ఇంకా 300 మంది మందుల ద్వారా చికిత్స‌ తీసుకున్నారని 26 ఏళ్ల యువ డాక్ట‌ర్ గార్గీ స‌ప్క‌ల్ తెలిపారు. తాను పూణెలో డెంటిస్ట్ చ‌దువు పూర్తి చేసుకొని ఈ సంస్థ గురించి విని పేద‌ల‌కు స్వ‌చ్ఛందంగా సేవ‌లు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం సైలాని బాబా దర్గా సందర్శనకు వచ్చే దూర ప్రాంత ప్రజలకు సేవలను అందిస్తున్నామన్నారు. పేషంట్లకు, వారి కుటుంబాలకు రకరకాల పద్ధతుల్లో చికిత్సను అందిస్తున్నామ‌న్నారు. వారి సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా విడమర్చి చెబుతూ వారి విశ్వాసాన్ని, దానికి తోడు తగిన మందులను ఇవ్వ‌డం ద్వారా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. పరివర్తన్‌ ట్రస్టు అనేది ఎన్జీవో సంస్థ. దీన్ని స్వర్గస్తులైన డాక్టర్ నరేంద్ర దాబోల్కర్, డాక్టర్ శైలజ కలిసి స్థాపించారు. ఈ సంస్థ ప్రజల్లోని మూఢనమ్మకాలపై పోరాడుతుంది. ప్రజల్లో గల అజ్ఞానం మూలంగా చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను కూడా వారికి తెలిసిన విధంగా మూఢ‌న‌మ్మ‌కాల‌తో స‌మ‌స్య‌ల‌ను మ‌రింత పెద్ద‌దిగా చేసుకుంటారు. ఇలాంటి సమస్యలపై పరివర్త‌న్‌ ట్రస్టు చైతన్యం క‌ల్పిస్తున్న‌ది. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న దురాలవాట్లు, దోపిడీ- దౌర్జన్యాలు, సామాజిక బహిష్కరణల వంటి సమస్యలపై తగిన పద్దతుల్లోచికిత్స అందిస్తున్నది.