విధాత: మునుగోడు ఉప ఎన్నికకు ముందు మొదలైన పార్టీ మారుతున్నారనే ప్రచారం.. ఫలితం తర్వాత కూడా జరుగుతున్నది. ఇది ఎవరు చేస్తున్నారు? ఏ పార్టీ చేస్తున్నది? ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అన్ని పార్టీలు చేస్తుండవచ్చు. అయితే కచ్చితంగా ఏ పార్టీ అంటే మాత్రం తడుముకోకుండా ఆ పార్టీనే అంటున్నారు. ఆ పార్టీ వాట్సప్ వర్సిటీ నుంచి వచ్చినన్ని అబద్ధాలు మరే పార్టీ నుంచి రావంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇప్పుడు వాటికి ఈ యూట్యూబ్ ఛానళ్లు, మీడియా తోడయ్యాయి.
బ్రేకింగ్ కోసం..
ఒకటిరెండు యూ ట్యూబ్ ఛానళ్లు పని కట్టుకుని మాదంటే మాది బ్రేకింగ్ న్యూస్ అంటూ రోజుకో తీరున పూటకొకరిని తెర మీదికి తీసుకువచ్చి వాళ్లు పార్టీ మారుతున్నారు, వీళ్లు పార్టీ మారుతున్నారంటూ ప్రత్యేక లైవ్‌లు పెట్టి జనంలోకి వదిలి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీంతో సంబంధిత నాయకులు కిందా మీద పడి జవాబిచ్చుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. ఆ తర్వాత ఆ యూ ట్యూబ్ ఛానళ్లు మాకేం తెలియదన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని అదే చెబుతున్నామంటూ కవర్ చేస్తు జనాలను పిచ్చివాళ్లను చేస్తున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణలే నిన్న, మొన్నా వచ్చిన.. పుట్టిచ్చిన పుకార్లు.
నేతలకు తంటా..
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ నేతలు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కర్నె ప్రభాకర్ లాంటి వారు పార్టీ మారుతున్నారనే ప్రచారం చేశారు. తర్వాత వారు మేము పార్టీ మారటం లేదని బహిరంగంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఉప ఎన్నిక పోలింగ్ ముందు రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కేసీఆర్‌ను కలిసినట్టు ఫేక్ ఫొటోలతో వైరల్ చేశారు. దీనిపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పాల్వాయి స్రవంతిలు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
ఉప ఎన్నిక తర్వాత..
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి టీఆర్‌ఎస్ నేతలు భారీగా చేరుతారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఆ పార్టీ నుంచే చాలా మంది నేతలు అధికార పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలో చేస్తున్నవిష ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వారం రోజులు ఎలాంటి ప్రచారాలు లేవు.
ఈటలకు డిప్యూటీ సీఎం అంటూ..
రెండు రోజుల కిందట ఈటల రాజేందర్ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నాడని ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారనే వార్త వైరల్ అయ్యింది. దీన్ని అటు టీఆర్‌ఎస్ ఇప్పటివరకు ఖండించినట్టు లేదు. కానీ ఇటు ఈటల రాజేందర్ మాత్రం ఖండించారు. కావాలని టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారమని మండిపడ్డారు.
విమానం ఎక్కితే మారినట్టేనా..
తాజాగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి అందుకే వెళ్లారని ప్రచారం జరిగింది. దీనిపై శశిధర్‌రెడ్డి స్పందిస్తూ.. నేను ఢిల్లీకి రావడం కొత్త కాదని. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారంలో నిజం లేదని.. నేను రాజకీయాల్లోనే ఉన్నానని.. రిటైర్ కాలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కావాలంటే నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలున్నారు అడగండి అని సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి కల్పించారు.
శృతి మించుతున్న ఆగడాలు..
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మీడియా, యూ ట్యూబ్ ఛానళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. సమాజంలోని సమస్యలను, మంచి చెడులను తెలియజేస్తూ నాయకులను, అధికారులను, ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి.. తమలోని ఆగ్రహాన్ని, ఆసహనాన్ని, ఈగోను చల్లార్చుకునేందుకు అవతలి వారిపై బురద చల్లి శునకానందం పొందుతున్నారు. ఇలా రోజుకోక వార్తను ముందేసుకుంటుండడంతో అసలు సమస్యలు తెరమీదకు రాకుండా పొతున్నాయి. రోజుల తరబడి ఆ పార్టీ మార్పుల గురించే చర్చించుకోవాల్సి వస్తుంది.
ఈ వివాదం ఎన్నాళ్లో..
ఇక కవిత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేేతో మాట్లాడరంటూ కొత్తగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇది ఎంత దూరం పోతుందో చూడాలి. ఎవరు ఎన్ని రకాలుగా ఈ వార్తను మలుపులు చుడతారో గానీ మరో వారం రోజులు పాటు దీనిపైనే చర్చ నడుస్తది అది మాత్రం కన్ఫమ్.