Pawan Kalyan: రెమ్యునరేషన్ రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్!

విధాత, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమా కోసం తీసుకున్న పారితోషికం మొత్తాన్ని చిత్రనిర్మాత ఏఎం.రత్నంకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతవరకూ సినిమా సెన్సార్ పూర్తి కాకపోవడంతో పాటు థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో నిర్మాత ఏఎం.రత్నం టెన్షన్‌లో పడిపోయారు. వీఎఫ్ఎక్స్ పనులు కూడా ఆలస్యమవ్వడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో నిర్మాత ఇబ్బందులు చూసిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా ఈ జూన్ 12న విడుదల కానుంది.
2020లో మొదలైన సినిమా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ డిప్యూటీ సీఎం హోదాలో మరింత బిజీగా మారిపోగా సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. మధ్యలో డైరక్టర్ క్రిష్ దర్శకత్వ బాధ్యతలనుంచి తప్పుకోగా..నిర్మాత రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరక్టర్ గా చిత్రీకరణ పూర్తి చేశారు. సినిమా ఇన్నాళ్లుగా నిర్మాణంలో ఉండిపోవడం..థియేటరికల్ బిజినెస్ కాకపోవంతో నిర్మాతపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ తన పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. కాగా హరిహర వీరమల్లు సినిమా విడుదలను మేకర్స్ మరోసారి వాయిదా వేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ జూన్ 12న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా జులై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.