Pawan Kalyan|
విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కినా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాత్రం పెద్దగా సీరియస్‌గా కనిపించడం లేదు. మొన్న నామ్ కే వాస్తేగా ఢిల్లీ వెళ్లారు… పెద్దలను కలవాలని ప్రయత్నించారు. కానీ అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. అమిత్ షా వంటి వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెళ్ళాం.. వచ్చాము.. అన్నట్లుగా ఢిల్లీ టూర్ ముగిసింది.
సరే ఢిల్లీలో పొత్తులు ఎత్తుకు కుదిరితే మంచిదే, లేనపుడు తనకంటూ ఒక మార్గం, ఒక బాట వేసుకోవాల్సిన అవసరాన్ని, అనివార్యతను పవన్ ఎందుకు గుర్తించడం లేదన్నది ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఎంత సేపూ బీజేపీ, టీడీపీలతో పొత్తుల గురించి, సీట్ల పంపిణీ గురించి ఆలోచన తప్పితే సొంతంగా పార్టీని బలోపేతం చేసి పార్టీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపే ఆలోచన పవన్ చేయకపోవడం పట్ల ఆయన అభిమానుల్లో సైతం నైరాశ్యాన్ని నింపుతోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగుల్లో అయన బిజీగా ఉన్నారు. పార్టీ ప్రచారం కోసం అంటూ ఘనంగా డిజైన్ చేయించిన వారాహి వాహనం ఎప్పుడు రోడ్డెక్కుతుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా ఎన్నో కొన్ని సీట్లు ఇస్తాం అవి తీసుకుని పవన్ మాకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నట్లుగా కొందరు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఖండించలేని పరిస్థితి.
మరోవైపు పాదయాత్రలో ఉన్న లోకేష్ ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఆయా చోట్ల జనసేనకు కార్యకర్తలు ఉండరా..? ఉన్నా టికెట్ మీద ఆశలు వదులుకుని టీడీపీకి సపోర్ట్ చేయవలసిందేనా.. అసలు పవన్ ఆలోచన ఏమిటి..? ఏమనుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకుల మనోభావాలు ఆయనకు పట్టవా..? వారాహి రోడ్డు మీదకు రావాలి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలన్నదే వారి కోరిక.