విధాత, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న పవన్‌కు ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా.. ఆయన క్రేజ్‌ని డబుల్ చేసింది. ఆ సినిమా తర్వాత మరోసారి పవన్, హరీష్ కాంబినేషన్‌లో సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రకటన అయితే వచ్చింది కానీ.. పవన్ పొలిటికల్ బిజీ కారణంగా సంవత్సరంపైనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి టైమ్ తీసుకుంది. ఈ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. బుధవారం నుంచి హైదరాబాద్‌లో వేసిన పోలీస్ స్టేషన్ సెట్‌లో రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది. ప్రస్తుతం ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం ఈ షూట్‌లో పాల్గొన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది అని తెలుపుతూ.. మేకర్స్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టరే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణం అవుతుంది. అసలీ పోస్టర్‌లో ఉంది పవనేనా? అనేలా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సరిగ్గా చూస్తే.. పవన్ కాదు డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ పిక్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. చెక్క కుర్చీలో ఉన్న బ్యాక్ ఫొటో ఇది. పవనా? హరీషా? అని కొందరు వ్యక్తం చేసిన అనుమానాలతో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.
పవన్ కల్యాణ్ అయితే షూటింగ్‌లో పాల్గొన్నది నిజం. అయితే వెంటనే ఇలా లుక్ రావడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే.. ఆ మధ్య ‘గబ్బర్ సింగ్’లో ఓ సీన్‌లో పవన్ కల్యాణ్ లేకుండానే షూట్ చేసినట్లుగా హరీష్ శంకర్ చెప్పారు. ఆ సీన్‌లో తనే పవన్ కల్యాణ్‌లా నిలబడినట్లుగా చెప్పాడు. ఇప్పుడు కూడా అలాంటి జిమ్మిక్కు ఏమైనా చేశాడా? అని కొందరు ఫ్యాన్స్ అనుకుంటుండటం విశేషం.
అయితే మరి కొందరు మాత్రం.. పవన్ కల్యాణ్ భక్తుడైన హరీష్ అలా ఎందుకు చేస్తాడు? అంటూ వారంతటికి వారే సర్ది చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఈ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై హరీష్ ఎటువంటి వివరణ ఇస్తాడో వేచి చూడాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. పవన్ కళ్యాణ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.