విధాత, సినిమా: కే రాధాకృష్ణ ఆలియాస్ చిన్న బాబు తన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్‌పై కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రమే సినిమాలు చేస్తానని ఇతర దర్శకులతో పనిచేయని ఎప్పుడో చెప్పారు. అందుకే మిగిలిన హీరోలతో దర్శకులతో పని చేయడం కోసం సూర్యదేవర నాగవంశీతో సితార ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను ప్రారంభించారు.
హారిక హాసిని ప్రొడక్షన్స్‌లో చిన్నబాబు నిర్మించే చిత్రాలన్నిటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. గత కొంతకాలంగా ఆయన ఇదే పని చేస్తూ వస్తున్నారు. వీరి కాంబినేషన్ జులాయితో మొదలయ్యింది. అ ఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురంలో అనే చిత్రాలను నిర్మించారు. వీటన్నిటికీ గురూజీ త్రివిక్రమే దర్శకులు.
ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్- మహేశ్‌ల కాంబినేషన్‌లో SSMB 28 అనే చిత్రం నిర్మిస్తున్నారు. దీంతో ఈయన ఈ బ్యానర్‌లో చేసిన చిత్రాల సంఖ్య ఏడుకు పెరిగింది. ఏడింటికి దర్శకుడు త్రివిక్రమే. ఆయనకు ఈ బ్యానర్లో వాటా కూడా ఉందని అంటారు. అలా తన భాగస్వామ్యం ఉండబట్టే కేవలం హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ చిత్రాలను మాత్రమే త్రివిక్రమ్ చేస్తాడనే వాదన ఉంది.
ఇక విషయానికి వస్తే తాజాగా త్రివిక్రమ్ పీపుల్ మీడియాను కూడా ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ తమిళ హిట్ మూవీ వినోదాయ సిత్తంను పవన్‌తో రీమేక్ చేయనుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాసే తయారు చేశారు. మాటలు, స్కీన్ ప్లే అందిస్తున్నారు.
పవన్ దైవ దూతగా నటిస్తుండగా కీలకపాత్రలో ఆయన మేనల్లుడు యంగ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. దాంతో సాయి ధరంతేజ్ ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాడట. సాయిధరమ్ తేజ్ పరిస్థితి చూస్తే ఆయన విరుపాక్ష చిత్రం తర్వాత మరో చిత్రం ఒప్పుకోలేదు. ఆయన చేతిలో మరో చిత్రం లేదు. వినోదయ సిత్తం రీమేక్‌లోనే నటించాల్సి ఉంది.
అయితే దానికి పవన్ రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా డేట్స్ ఎప్పుడు కేటాయిస్తారు? ఎప్పుడు సినిమా ప్రారంభిస్తాడు? ఎప్పుడు పూర్తవుతుంది? అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. త్వరలో సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమా సిద్ధమవుతోంది ఆ వెంటనే మరో సినిమా ఒప్పుకోవాలంటే వినోదాయ సిత్తం రీమేక్ అడ్డంకిగా మారింది.
పోనీ సినిమా వదిలేసుకుందామంటే అది వీలుకాని పని. ఎందుకంటే ఇది తన మామయ్య పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడం, పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశం లభించడంతో సాయి ధరమ్ తేజ్ డైలమాలో పడిపోయాడని అంటున్నారు. మొత్తానికి పవన్ వినోదయ సిత్తం విషయంపై క్లారిటీ వచ్చేవరకు సాయి ధరమ్ తేజ్ మరో చిత్రానికి డేట్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.