పాత పథకాల సంగతేమిటో!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ సహజంగానే ప్రజల్లో కొత్త పథకాల అమలుపై భారీ అంచనాలే ఉన్నాయి

పాత పథకాల సంగతేమిటో!
  • లబ్ధిదారుల్లో అయోమయం
  • రుణమాఫీ.. రైతుబంధుకు ఎదురుచూపు
  • గృహలక్ష్మి, బీసీ, మైనార్టీ ‘బంధు’లదీ అదే తీరు
  • ఎన్నికల వేళ ‘బంధు’లు తెచ్చిన బీఆరెస్‌
  • ఓట్లు తెచ్చిపెడుతాయని ఆశించిన నాటి సర్కార్‌
  • హడావుడిగా లబ్ధిదారుల ఎంపికలు
  • అందులోనూ పెద్ద ఎత్తున అవకతవకలు
  • కొందరికే చెక్కులు.. మిగిలినవారికి?
  • బీసీ బంధు రద్దు చేస్తున్నామన్న మంత్రి పొన్నం
  • బీఆరెస్‌ తెచ్చిన ఇతర ‘బంధు’లూ బందేనా?


విధాత : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ సహజంగానే ప్రజల్లో కొత్త పథకాల అమలుపై భారీ అంచనాలే ఉన్నాయి. అధికార సాధన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు హామీల వరాలు కురిపించింది. గత ప్రభుత్వంపై వ్యతిరేకతనో లేక మార్పు కావాలన్న ఆకాంక్షనో గానీ జనం కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. అయితే గత బీఆరెస్ ప్రభుత్వం చివరి ఆరునెలల్లో పలు సంక్షేమ పథకాలను హడావుడిగా తీసుకొచ్చింది. ఎన్నికలకు ముందే లక్షల రూపాయలు అందించే ఉద్దేశంతో తెచ్చిన ఈ పథకాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


రాజకీయ లబ్ధి కోసమే చివరి నిమిషంలో హడావుడిగా పథకాలు తీసుకొచ్చారని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ.. ప్రభుత్వం పట్టించుకోకుండా హడావుడి చేసింది. ఈ హయాంలో కొంతమందికి ఇచ్చి, గెలిచిన తర్వాత మిగిలినవాళ్ల ఇవ్వొచ్చన్న ఆలోచనతో రుచి చూపించి వదిలేసింది. కానీ.. ప్రజలు ఇదే కోపంతో బీఆరెస్‌ను గద్దె దించారు. దీంతో గతంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటన్నది సందేహాస్పదంగా మారింది. వాటి లబ్ధిదారుల్లో అయోమయాన్ని, ఆందోళనను రేకెత్తిస్తున్నది.


రైతు రుణమాఫీ చివరి విడత సంగతేంటి?


ముఖ్యంగా రైతు రుణమాఫీలో 2018 డిసెంబర్ 11నాటికి తీసుకున్న లక్ష లోపు రుణాల మాఫీలో భాగంగా 22.46 లక్షల మంది రైతుల్లో 12,617 కోట్లు మాఫీ చేశారు. మరో 7.15 లక్షల మంది ఖాతాల్లో 6,400 కోట్లు రుణమాఫీ జమ చేయాల్సి ఉందని సమాచారం. కొత్త ప్రభుత్వం మిగిలిపోయిన రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాగే కొత్తగా కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీకి నిబంధనలు ఏమిటి? అన్న విషయంలో రైతాంగంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.


దీనికి తోడు రైతుబంధు నిధుల చెల్లింపు కూడా ప్రభుత్వం మారడంతో గందరగోళంలో పడిపోయింది. రైతు బంధు పథకం ద్వారా గత ప్రభుత్వం ఇప్పటి వరకు 11 విడుతల్లో పంట పెట్టుబడి సాయం అందించింది. మొత్తం రూ.72,817 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ స్కీమ్ ద్వారా 65 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకురింది. ఈసారి యాసంగి సీజన్‌లో 70 లక్షల మంది రైతులకు పంట పెట్టబడి సాయం అందాల్సివుంది.


అయితే పాత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందా? లేక తాము కొత్తగా ఇచ్చిన రైతు భరోసా మేరకు 15 వేల సాయం అందిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనితోపాటు ఇస్తే ఎప్పడిస్తారు? పెద్ద రైతులకు, ఉద్యోగస్థులు, ఐటీ చెల్లింపుదారులు, రియల్టర్లకు, ఫామ్‌హౌజ్‌దారులకు రైతు సహాయం నిధులు అందకుండా నిబంధనలు మారుస్తారా? అన్న చర్చ నడుస్తున్నది. ఇప్పటికే హరీశ్‌రావు లాంటివారు దీనిపై కొత్త ప్రభుత్వాన్ని విమర్శకాదంటూనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


రేవంత్‌ చెప్పిన 9వతేదీ గడువు దాటింది..


నిజానికి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9కల్లా తమ ప్రభుత్వం వస్తుందని.. రైతుల ఖాతాల్లో 15వేల రైతు భరోసా నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన తేదీ దాటిపోయింది. సరే ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది.. శాఖల కేటాయింపు పూర్తయింది. అయితే.. రైతు భరోసాపై విధివిధానాల ఖరారుకు ఎంత సమయం పడుతుందన్నది అర్థం కాకుండా ఉన్నది.


దళితబంధు అక్కడక్కడే


గత ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పకంలో భాగంగా ఎన్నికలకు ముందు 45 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మరి వారికి 10లక్షలు ఇస్తారా? లేదానన్న నెలకొంది. ఇదే రీతిలో గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున 3,65,975 వేల మందిని, సీఎం కోటాలో మరో 35వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దాదాపుగా వారందరి ఖాతాల్లో మూడు దశల్లో 3 లక్షలు పడుతాయని చెప్పి వారికి మంజూరు పత్రాలను అందించారు.


ఇప్పుడు ఆ ప్రొసిడింగ్స్ కాపీలు చిత్తు కాగితాలేనా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండ్ల సంగతేం చేస్తారు? ఇండ్లు కావాలని 15.04 లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ గృహలక్ష్మి కింద ఇస్తామని చెబుతున్నది. అంటే.. గతంలో దరఖాస్తులు ఇచ్చినవారి సంగతేంటి? మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, ఇందిరమ్మ ఇంటి పథకంతో 5లక్షల ఆర్థిక సహాయం అందిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.


రద్దయిన బీసీ బంధు


బీసీ బంధు కింద 1లక్ష సహాయం పథకంలో తొలి విడుత నియోజకవర్గానికి 300నుంచి 400మంది లబ్ధిదారుల చొప్పున 4.21 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. తొలి విడత సహాయం కొంత మందికి మాత్రమే అందించగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ బీసీ బంధును రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో లబ్ధిదారులుగా ఎంపికైన వారంతా కంగుతిన్నారు.


మైనార్టీ బంధు పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దాదాపు 120 మంది ల‌బ్ధిదారుల‌ను అధికారులు ఎంపిక చేశారు. తొలి దశలో 100 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, రెండో దశలో 153 కోట్లు కేటాయించారు. తొలి విడత లబ్ధదారులకు మాత్రమే సింహభాగం చెక్కులు అందాయి. ఎన్నికలు రావడంతో రెండో విడత పెండింగ్‌లో పడిపోయింది.


గొర్రెలదీ అదే స్థితి


రెండో విడుత గొర్రెల పంపిణీలో 3లక్షల 37వేల మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సివుండగా వారిలో మెజార్టీ సంఖ్యలో లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటన్నది కూడా ఆగమ్య గోచరంగా మారింది.