Pilot Vs Patnam |
విధాత: వారిద్దరూ అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి. కానీ, వారిద్దరికి ఏమాత్రం పడదు. తమ వ్యవహారశైలితో ఎప్పుడూ గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రాజకీయం విచిత్రంగా నడుస్తున్నది. అధికార, విపక్ష పార్టీల మధ్య ఎప్పుడూ మాటల తూటాలు, సవాళ్లు.. ప్రతి సవాళ్లు కామనే.
కానీ, తాండూరులో అధికార నేతల మధ్య వార్ కొనసాగుతూనే ఉన్నది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మధ్య రాజకీయ విభేదాలున్న విషయం బహిరంగ రహస్యం. గతంలో ఇద్దరి మధ్య పంచాయితీ దాదాపు పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. మళ్లీ ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
రథోత్సవంలో మరోసారి బయటపడ్డ విభేదాలు..
వికారాబాద్ జిల్లాలో ప్రముఖ ఆలయమైన తాండూరు భగవి భద్రేశ్వరస్వామి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. భద్రేశ్వరుడికి హారతి ఇచ్చే సమయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు పట్నం మహేందర్‌రెడ్డి ముందుకు వచ్చారు. హారతి పల్లాన్ని పట్నం మహేందర్‌రెడ్డి పట్టుకోకుండా వారించారు.
ఈ సందర్భంగా పట్నం మహేందర్‌రెడ్డిపైకి రోహిత్‌రెడ్డి చేతిని ఎత్తడంతో పాటు దూషించారు. ఆ తర్వాత రథాన్ని లాగే సమయంలోనూ ఇరువర్గాల అనుచరులు తన్నుకున్నారు. భద్రేశ్వరుడి రథోత్సవం సాక్షిగా జరిగిన ఇద్దరి నేతల విభేదాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయంగా ప్రత్యర్థులే అయినా ఇద్దరు నేతలు అధికార బీఆర్ఎస్‌లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యం పోరుతో గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గతంలోనూ ఇద్దరి మధ్య పంచాయితీలు నెలకొన్న విషయం తెలిసిందే.
తాండూరు సీఐని విషయంలో పట్నం మహేందర్‌రెడ్డి దూషించిన ఆడియో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, తాను సీఐని దూషించలేదని, ఇదంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుట్రేనని ఆరోపించారు. అలాగే టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలు, మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఇద్దరి మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత ఈ విషయం అధిష్టానం దాకా వెళ్లడంతో ఇద్దరికి గట్టి వార్నింగ్ సైతం ఇచ్చింది. అయినా, ఇద్దరి మధ్య రాజుకున్న మంటలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నది.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య..
పైలెట్ రోహిత్‌రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయరంగ ప్రవేశం చేశాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిపై ఓటమిపాలయ్యాడు. 2013లో పీఆర్పీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాడు.
2014 ఎన్నికలు జరిగే నెల ముందు తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు రోహిత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దాంతో 2018లో ఆయనను టీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరించింది.
దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన పట్నం మహేందర్‌రెడ్డిపై 10వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 జూన్‌లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి.
ప్రస్తుతం తాండూరు ఎమ్మెల్యే అయిన రోహిత్‌రెడ్డి గులాబీ పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తుండగా.. మరో వైపు తగ్గేదెలే అన్నట్లుగా పట్నం వ్యవహారం ఉన్నది. భద్రేశ్వరుడి రథోత్సవం సాక్షిగా సాగిన ఇద్దరి మధ్య పంచాయితీ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరో వైపు ఈ వ్యవహారంపై ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.