విధాత, దిల్లీ: గత ప్రభుత్వాలు రైల్వేల ఆధునికీకరణపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమని ప్రధాని మోదీ (Modi) విమర్శించారు. భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే.. రైల్వేల్లో సమూల మార్పులకు పాటుపడుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో తొమ్మిది వందేభారత్ రైళ్లను ఆదివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తొమ్మిది వందేభారత్ (Vande Bharath) రైళ్లూ రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, పశ్చిమ్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్‌లలో పరుగులు పెట్టనున్నాయని తెలిపారు. అంతకుమందు వీడియో కాన్ఫరన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. ‘140 కోట్ల మంది భారతీయుల ఆశలకు అనుగుణంగా రైల్వేను తీర్చిదిద్దుతున్నాం.
వందేభారత్ రైళ్లకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న 25 వందేభారత్ రైళ్లలో ఇప్పటివరకు ఒక కోటీ 11 లక్షల మంది ప్రయాణించారు. వందేభారత్‌ల ద్వారా దేశం మొత్తం అనుసంధానం అయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో భారతీయుల ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి. వారి ఆలోచనలను మేము అందుకోవాల్సి ఉంది’ అని అన్నారు.
ప్రస్తుతం ప్రవేశ పెట్టిన వందేభారత్ రైళ్లు ఉదయ్‌పూర్ – జైపూర్, తిరునల్వేలీ – మదురై – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, విజయవాడ – చెన్నై (రేణిగుంట), పట్నా – హౌరా, కాసర్‌గోడ్ – తిరువనంతపురం, రౌర్కెలా – భువనేశ్వర్ – పూరి, రాంచీ – హౌరా, జామ్‌నగర్ – హైదరాబాద్‌ల మధ్య పరుగులు పెట్టనున్నాయి.