భారతదేశం ఇప్పుడు ఓ మహోన్నత కార్యక్రమం కోసం ఎదురుచూస్తోంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో మోదీ 11 రోజుల ఉపవాస దీక్షను ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు. ఈ 11 రోజుల పాటు మోదీ కఠోర దీక్ష చేస్తున్నట్లు సమాచారం. అత్యంత నిష్ఠతో ఉంటున్నారని తెలిసింది.
మోదీ కేవలం నేలపై పడుకుంటున్నారని తెలిసింది. ఇక కొబ్బరి నీళ్లు సేవిస్తూ ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తన చేతుల మీదుగా జరగడం తనకు కలిగిన అదృష్టం అని మోదీ ఇటీవలే పేర్కొన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు భారతీయుల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఆ దేవుడు తనను ఎంచుకున్నాడని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాను 11 రోజుల పాటు ప్రత్యేకమైన ఉపవాస దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రత్యేక ఉపవాస దీక్షలో యోగా, ధాన్యం కూడా ఉన్నాయి. సూర్యోదయానికి ముందే మోదీ మేల్కొని, దీక్ష ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. యోగా పూర్తయిన అనంతరం సాత్విక ఆహారాన్ని ఆయన తీసుకుంటున్నట్లు సమాచారం. మోదీ కఠోర తపస్సు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.