ఖాకీల కారుణ్యం.. భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం

విధాత: పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు  ఉంటుందని నిరూపితమైన ఘటన ఇది. నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గ మధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ అభాగ్యుని దీన గాథ ఇది. బుధవారం ఒరిస్సా కు చెందిన ఇది […]

  • By: krs    latest    Feb 09, 2023 1:25 PM IST
ఖాకీల కారుణ్యం.. భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం

విధాత: పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు ఉంటుందని నిరూపితమైన ఘటన ఇది. నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గ మధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ అభాగ్యుని దీన గాథ ఇది.

బుధవారం ఒరిస్సా కు చెందిన ఇది గురు అనే మహిళ విశాఖ జిల్లాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరగా బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో భర్త సాములు ఆమెను ఆటోలో కోరాపుట్ జిల్లాలోని సరోడా గ్రామానికి బయల్దేరాడు. ఖర్మ బాలేదు.పేదవాడికి చావు కూడా కష్టంగానే వస్తుంది.. అందుకే ఆటో విజయ నగరం రాగానే గురు ఆటోలోనే కన్నుమూసింది.

ఇక శవాన్ని నేను అంతదూరం తేలేను అంటూ 2000 లాక్కుని ఆటోడ్రైవర్ అక్కడే దించేశాడు. సాములుకు తెలుగు రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. జీవితాంతం భార్యను ఆదరిస్తానని పెళ్లి నాడు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇక ఏం ఆలోచించలేదు..జస్ట్ 130 కిమి నడిచేద్దాం అని నిర్ణయించుకుని భార్యను భుజాన వేసుకున్నాడు.

కన్నీళ్లు దారి కప్పేస్తున్నాయ్.. అడుగులు తడ బడుతున్నాయ్.. భుజాన భార్య వేలాడుతోంది..అయినా సాములు నడుస్తూనే ఉన్నాడు. ఈ విషయం ఏదోలా పోలీసులకు చేరింది. వెంటనే సీఐ తిరుపతి రావ్, ఎస్సై కిరణ్ కుమార్ హుటాహుటిన వచ్చి సాములుకు ఊరడించి కాసిన్ని నీళ్లు తాగించి.. చేతికి డబ్బు ఓ పదివేలు పెట్టి అంబులెన్స్ ఏర్పాటు చేసి వారిని స్వగ్రామానికి పంపారు. పోలీసుల సాయానికి సాములు కన్నీళ్ళతో కృతజ్ఞత తెలుపగా గురు శవాన్ని తీసుకుని అంబులెన్స్ ఒరిస్సా వైపు దారి తీసింది.