విధాత: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు రాజకీయ వేడి రాజేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు పర్యటనల వరుస షెడ్యూళ్లను ఫిక్స్ చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలిరా’ పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. 25 లోక్ సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్ణయించింది.
తొలిసభ ఈనెల 5న ఒంగోలు లోక్ సభ స్థానం పరిధిలోని కనిగిరిలో ప్రారంభమై కొనసాగుతోంది. అందులో భాగంగా ఈనెల 27 నుంచి రెండో షెడ్యూల్ ను చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. అదేరోజు సీఎం జగన్ జిల్లాల పర్యటనకు ‘సిద్ధం’ పేరుతో రెడీ అయ్యారు. భీమిలి వేదికగా ఆయన వైసీపీ సభలకు శ్రీకారం చుట్టనున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెలాఖరులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఆమె చేపట్టిన జిల్లాల పర్యటన ఈనెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై.. ఈనెల 31న కడప జిల్లాలో ముగియనుంది. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలంతా పర్యటనల షెడ్యూళ్లు ఫిక్స్ చేసుకున్నారు.
27 నుంచి ప్రజాక్షేత్రంలోకి సీం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి పీఠం ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకుని శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. అందుకు తగినట్లు ప్రణాళికలు రచిస్తున్నారు. నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టారు. చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్న జగన్… ఇన్ చార్జిల మార్పులు, చేర్పులను ఈనెల 27 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాజకీయ సభలకు ప్రణాళిక రూపొందించారు. ఈనెల 27 న ఉత్తరాంధ్రలోని ‘సిద్ధం’ పేరుతో చేపట్టిన భీమిలి తొలి బహిరంగ సభ ఇందుకు వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలకు కలిపి 5 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటుకు అధిష్టానం నిర్ణయించింది. ఫిబ్రవరి 10లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు.
చంద్రబాబు ‘రా.. కదలిరా’ రెండో షెడ్యూల్
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల యుద్ధానికి శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈక్రమంలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు ‘రా.. కదలిరా’ రెండో షెడ్యూల్ ను చంద్రబాబు కొనసాగించనున్నారు. 27, 28, 29 తేదీల్లో వరుసగా 6 నియోజకవర్గాల్లో బాబు పర్యటించనున్నారు. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమండ్రి రూరల్, పొన్నూరు బహిరంగ సభలకు టీడీపీ సమాయత్తమైంది.
పవన్ కళ్యాణ్.. రోజుకు 3 సభలు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పార్టీల్లో ఒకటైన జనసేన.. ఈసారి ఎలాగైనా అత్యధిక స్థానాల్లో గెలుపొంది సత్తాచాటాలని పావులుకదుపుతోంది. పార్టీ అధినేత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆ దిశగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి అధినేత క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని ఆపార్టీ ప్రకటించింది. రోజుకు 3 సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మొత్తం 5 జోన్లుగా విభజించుకుని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జోన్ 1, రాయలసీమ జోన్ 2గా విభజించారు. ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటించేలా జనసేన అధిష్టానం నిర్ణయించింది.
31 వరకు కొనసాగనున్న షర్మిల షెడ్యూల్
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈనెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు.. 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.. 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు.. 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు.. 31న నంద్యాల, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగి, ఇడుపులపాయతో ముగుస్తుంది.