Gadwal
విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ లో అధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని మానవపాడు మండలం నుంచి జడ్పీటీసీ గా గెలుపొందిన సరితను పార్టీ అధిష్టానం గద్వాల జడ్పీ చైర్ పర్సన్ గా పదవి కట్టబెట్టింది. కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ చురుకుగా పాల్గొన్నారు.
కొన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా స్వతహాగా చేపట్టడంతో సరితపై ఎమ్మెల్యే ఆగ్రహిoచిన సంఘటనలు జరిగాయి. ఇదే అదనుగా భావించిన సరిత భర్త వెంకటయ్య సహాయంతో గద్వాల నియోజకవర్గంలో పట్టు పెంచుకునెందుకు ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేకు చెప్పకుండా సరిత కార్యక్రమాలు కొనసాగించడంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది.
ఓ సందర్బంలో గురుకుల పాఠశాల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాకముందే జడ్పీ చైర్ పర్సన్ సరిత ప్రారంభిoచారు. ఈ సంఘటనతో ఆగ్రహo చెందిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులపై ఆగ్రహం చెందారు. ఓ అధికారిని అందరిముందే కాలరు పట్టుకొని నిలదీశారు. ఈ సంఘటన గద్వాల నియోజకవర్గం లో పెను సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనేవుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని బాహాటంగా ప్రకటిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతు సరిత నియోజకవర్గంలో ముందుకు వెళుతున్నారు. సరితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్టీ అధిస్టానానికి ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర నాయకులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించేoదుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు తగ్గించేందుకు రాష్ట్ర పార్టీ చర్యలు చేపట్టింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా టికెట్ ఆశించిన వారి నెత్తిన పిడుగు పడ్డట్లయింది. వీరంతా తలో దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే బాటలో గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత కూడా సాగుతున్నారు. ఆమె కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ మార్పుపై తన అభిప్రాయం తెలియజేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 20న కొల్లాపూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ లో ప్రియాంక గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.
గద్వాల బీఆర్ఎస్ కు దెబ్బ
గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ పార్టీ ని వీడితే ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ కి భారీ నష్టం వాటిల్లుతుంది. సరిత సామాజిక వర్గం ఈ నియోజకవర్గం లో బలంగా ఉంది. సుమారు 30 వేల ఓట్లు ఈమె సామాజిక వర్గానికి ఉండగా, వీరందరినీ ఒక్కతాటి పైకి తెచ్చేందుకు సరిత ప్రయతం చేస్తున్నారు.
ఇదే జరిగితే బీఆర్ఎస్ భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరిత పార్టీ వీడకుండా బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను బుజ్జగించడం కొనసాగిస్తున్నా అమె ఇప్పటికే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితుల కథనం.
గద్వాలా బీఆరెఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డీకే అరుణ మధ్య ఉన్న అధిపత్య పోరును అవకాశంగా తీసుకుని రాజకీయంగా ముందుకు పోవాలని జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్‌లో సరిత చేరికతో మారనున్న గద్వాల్ రాజీయాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మలుపు తిరుగుతాయో వేచిచూడాల్సివుంది