Ramagundam
విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం బీఆరెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్, ఆయన వ్యతిరేకవర్గం ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు.
అసమ్మతినేతల ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ ఈ ఎపిసోడ్ లో కీలక పాత్ర పోషించింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ పై కలవరపాటుకు గురవుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియోజకవర్గంలో ‘రామగుండం ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర’ చేపట్టారు.
అయితే ఆయన కంటిలో నలుసులా మారిన అసమ్మతినేతలు ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టి ఆయనకు గట్టి జలక్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే హుటాహుటిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అసమ్మతినేతలు కందుల సంధ్యారాణి, పాత పెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మీనారాయణ, మిరియాల రాజిరెడ్డి, బయ్యపు మనోహర్ రెడ్డి లను పార్టీ నుండి తొలగించాలని తీర్మానించారు.
దీనిపై అసమ్మతి నేతలు ఘాటుగానే స్పందించారు. ఎమ్మెల్యే అసలు సిసలైన బీఆరెస్ నేత కాదని సూత్రీకరించారు. ఈ మేరకు వారు ఓ బహిరంగ లేఖ రాశారు.
నేరుగా విమర్శలు
బహిరంగ లేఖలో అసమ్మతినేతలు నేరుగా ఎమ్మెల్యే కోరుకంటిపై విమర్శలు చేశారు. లేఖలో కోరుకంటి చందర్ రాజకీయ చరిత్ర ఇక్కడి ప్రజలకు తెలియంది కాదని, 2009 లో ఆయనకు బీఆరెస్ టికెట్ కేటాయిస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదన్నారు. కేవలం నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో కూడా పార్టీ, పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించి పోటీ చేశారని, ఆరోజు ఆయనకు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. 2018 ఎన్నికల్లో సైతం ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు.
రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూశారని సానుభూతితో, తామంతా కలిసి అహర్నిశలు కష్టపడి పనిచేసి ఆయనను గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ… నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా నియోజకవర్గ ప్రజలకు చూపిస్తున్నారంటూ’ ఆరోపణలు చేసిన వ్యక్తులే ప్రస్తుతం ఎమ్మెల్యే పక్కన ఉంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కష్టపడి పని చేసి గెలిపించిన తమకు మాత్రం కేటీఆర్ సభకు, ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానం లేకుండా చేశారని ఆరోపించారు.
పార్టీలో తమను కించపరిచి, అవమానించిన విషయం, ఈరోజు విమర్శిస్తున్న వారికి గుర్తుకు రావడం లేదా అన్నారు. 2014,2018 ఎన్నికల సందర్భంలో మీరు చేసింది న్యాయం.. ప్రస్తుతం మేం చేస్తున్నది అన్యాయమా అంటూ తమ వైఖరిని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. తాము బీఆరెస్ పార్టీ విధానాలకు కట్టుబడి ఉన్నామని, ఇకపై కూడా ఉంటామన్నారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనే తాము ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టామని, ఈ యాత్ర నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, కార్యకర్తల్లో స్థైర్యం నింపుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా తమ యాత్రలో కలిసి రావాలని కోరారు. నేరుగా ఎమ్మెల్యే చందర్ ను ఉద్దేశించి రాసిన ఈ బహిరంగ లేఖ బీఆరెస్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.