Ponnala Vs Kommuri | బజారుకెక్కిన.. జనగామ కాంగ్రెస్‌ గ్రూపుల లొల్లి

Ponnala Vs Kommuri పొన్నాల కొమ్మూరి మధ్య కుమ్ములాట పరస్పరం బహిష్కరించుకుంటున్న దౌర్భాగ్యం గ్రూపుల మధ్య కాంగ్రెస్ కేడర్ విలవి అధికారం లేకున్నా మారని నాయకుల తీరు జనగామ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కలిసి ఉండడం మా ఇంట వంట లేదంటూ జనగామ కాంగ్రెస్ గ్రూపులు బజారుకెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, ఒకరిని ఒకరు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బహిరంగ ప్రకటనలు చేయడం పట్ల […]

  • Publish Date - April 28, 2023 / 07:16 AM IST

Ponnala Vs Kommuri

  • పొన్నాల కొమ్మూరి మధ్య కుమ్ములాట
  • పరస్పరం బహిష్కరించుకుంటున్న దౌర్భాగ్యం
  • గ్రూపుల మధ్య కాంగ్రెస్ కేడర్ విలవి
  • అధికారం లేకున్నా మారని నాయకుల తీరు
  • జనగామ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కలిసి ఉండడం మా ఇంట వంట లేదంటూ జనగామ కాంగ్రెస్ గ్రూపులు బజారుకెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, ఒకరిని ఒకరు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బహిరంగ ప్రకటనలు చేయడం పట్ల రాజకీయ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతుండగా కాంగ్రెస్ లోని రెండు వర్గాలు కుమ్ములాడుకోవడం గమనార్హం.

కొమ్మూరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పొన్నాల వర్గానికి చెందిన జనగామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజి ప్రకటించగా, పొన్నాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కొమ్మూరి వర్గంనాయకులు గిన్నారపు ఆనందము,బొట్ల మల్లయ్య తదితరులు ప్రకటించడం ఆసక్తిగా మారింది.

జనగామ సెగ్మెంట్లో ఇద్దరి మధ్య నువ్వా నేనా అంటూ కుస్తీ పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, తాజా పీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాపరెడ్డి మధ్య ఉన్న వైరం బహిరంగంగా భగ్గుమన్నది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఐక్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి.

ఐక్యత అక్కడ లేదు ఇక్కడ లేదు

పీసీసీలో లేని ఐక్యత మేం మాత్రం ఎందుకు కలిసి ఉంటాం అంటూ జనగామ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. పట్టు కోసం ప్రయత్నించిన మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, తాజా పీసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి బహిరంగంగానే పోటీకి దిగుతున్నారు. ఇందులో పొన్నాల వర్సెస్ కొమ్మూరిగా పరిస్థితి మారగా మధ్యలో డిసిసి ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి అప్పుడప్పుడు మెరుస్తుంటారు. పోటీ కార్యక్రమాలతో నేతలు రచ్చకెక్కుతున్నారు.

అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్

అసలే రెండు టర్ములుగా అధికారం లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలడి అల్లాడుతోంది. ఈసారైనా అధికారంలోకి రావాలంటే పార్టీ నాయకుల మధ్య ఐక్యత ప్రధానమని కేడర్ పదేపదే చెబుతున్నా, చెవిన పెట్టే వారే లేకుండా పోయారు. పీసీసీ నాయకత్వం గ్రూపులతో కుమ్ములాడుకుంటున్నాయి. అదే బాటలో జనగామ కాంగ్రెస్ నాయకులు పయనిస్తున్నారు.

జిల్లాలో సాగుతున్న భట్టి యాత్ర

జనగామ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ఒకవైపు కొనసాగుతుండగా నాయకులు మాత్రం కుమ్ములాటలో మునిగిపోయారు. పరిస్థితిలో మార్పు లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కేడర్ తో పాటు ప్రజలు కూడా కర్రుగాల్సి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

జనగామలో బహిరంగ విమర్శలు

తొలి నుంచి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడ గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షునిగా నియామకమై 2014 ఎన్నికలను ఎదుర్కొన్నప్పటికీ అదృష్టం ఆయనకు కలిసి రాలేదు. రానున్న ఎన్నికల్లో మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

కొమ్మూరి ఎంటర్‌తో కొత్త సమస్య

వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమంటూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. తనకు పిసిసి నుంచి ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రకటిస్తూ పొన్నాలకు పోటీగా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇది పొన్నాల వర్గానికి మింగుడు పడడం లేదు. మరోవైపు జనగామ నూతన డిసిసి ప్రెసిడెంట్‌పై ఆశ పెట్టుకున్నారు.

డీసీసీ ప్రెసిడెంట్ నియామకం జాప్యం

ముఖ్య నాయకుల పోటీ మధ్య జనగామ డిసిసి నూతన అధ్యక్షుడి నియామకం కూడా పీటముడి పడింది. పొన్నాల తన అనుచరునికి ఇవ్వాలని పట్టుబడుతుండగా, కొమ్మూరి తనకు ఇవ్వాలని, రాఘవరెడ్డి నేను కూడా పోటీలో ఉన్నానంటూ ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి డిసిసి ప్రెసిడెంట్ నియామకం పెండింగ్లో పడింది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కేడర్ గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ బలాన్ని నీరుగార్చారు. ఈ తగాదా ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్‌ నెత్తిలో పాలు పోసినట్లేనని భావిస్తున్నారు.