విధాత, హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నగర సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన.. కృత్రిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలను సవాల్ చేస్తూ… తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్ గత సంవత్సరం వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత ధర్మాసనం పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఇదే పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరుఫు న్యాయవాది వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ.. గతేడాది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని న్యాయస్థానానికి గుర్తుచేశారు.
హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయలేదని ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించలేదని, కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నామని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని, ఆ దిశగా జీహెచ్ఎంసీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు.
ఇప్పటికీ కూడా ఆ దిశగానే ముందుకుపోతున్నామని తెలిపారు. పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌తోపాటు ఇతర చెరువుల్లో వేయకుండా గతేడాది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత సీపీ, జీహెచ్ఎంసీ అధికారులదే అని మరోసారి ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల్లో కేవలం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.