మేలుకొంటాయా? అలా మిగిలిపోతాయా? చంద్ర‌యాన్ ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌ల‌పై ఉత్కంఠ‌

మేలుకొంటాయా? అలా మిగిలిపోతాయా? చంద్ర‌యాన్ ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌ల‌పై ఉత్కంఠ‌

చంద్ర‌యాన్‌-3 (Chandrayan-3) ప్రాజెక్టు మ‌రోసారి దేశ‌వ్యాప్త ఉత్కంఠ‌కు కేంద్ర‌బిందువుగా నిలిచింది. ఆ ప్రాజెక్టులోని కీల‌క భాగాలైన రోవ‌ర్, ల్యాండ‌ర్‌లు ప్ర‌స్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అవి కాలిడిన చంద్రుని ద‌క్షిణ ధ్రువంపై గ‌త 14 రోజులుగా చీక‌టి స‌మ‌యం. తాజాగా 21వ తేదీన మెల్లిగా అక్క‌డ ఉద‌యం ప్రారంభ‌మ‌వుతోంది.

సూర్యుని కిర‌ణాలు పూర్తి స్థాయిలో శుక్ర‌వారం క‌ల్లా అక్క‌డ ప్ర‌స‌రించ‌నున్నాయి. దీంతో ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌లు నిద్రాణ స్థితి నుంచి బ‌య‌ట‌కొస్తాయా లేదా అని ఇస్రో ఎదురుచూస్తోంది. వాస్త‌వంగా వీటిని చంద్రునిపై ఒక పూట మాత్ర‌మే ప‌నిచేసేలా రూపొందించారు. చంద్రునిపై ఒక పూట మ‌న‌కు 14 రోజుల‌తో స‌మానం.

ఈ నేప‌థ్యంలో చంద్రునిపై ఒక ప‌గ‌టి పూట ప‌నిచేసిన ప‌రిక‌రాలు.. అక్క‌డ రాత్రిపూట న‌మోద‌య్యే -200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌ను త‌ట్టుకుంటాయా అనేది సందేహ‌మే. ఆగ‌స్టు 23న చంద్రునిపై చంద్ర‌యాన్‌-3 సాఫ్ట్‌ల్యాండింగ్ చేయ‌గా.. సెప్టెంబ‌రు2 నుంచి నిద్రాణ‌స్థితిలో ఉన్నాయి.

ల్యాండ‌ర్ దిగిన చోట ఇప్ప‌టికే సూర్యోద‌యం అయింద‌ని ఇస్రో శాస్త్రవేత్త ఒక‌రు తెలిపారు. అయితే సూర్యోద‌యం అయితేనే స‌రిపోద‌ని.. ల్యాండ‌ర్ సౌర ప‌ల‌కాలు ఆ శ‌క్తిని శోషించుకునేలా ఒక కోణంలోకి సూర్యుడు రావాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఇలా జ‌రిగిన త‌ర్వాత ఆ బ్యాట‌రీలు రీఛార్జ్ అయి, ఇస్రో నుంచి పంపిన సిగ్న‌ల్స్‌ను స్వీక‌రించాలి.

 వాటికి ప్ర‌తిస్పందిస్తే ల్యాండ‌ర్‌, రోవ‌ర్లు మేల్కొన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది అని విశ్లేషించారు. ‘ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌ల‌కు మ‌రిన్ని రోజులు ప‌నిచేసే శ‌క్తి ఉంది. అయితే రాత్రి వాటికి శ‌క్తినిచ్చే వ‌న‌రులు ప్రాజెక్టులో లేవు. బ్యాట‌రీలు అంత సేపు విద్యుత్‌ను ఇవ్వ‌లేవు కాబ‌ట్టి ఇవి మ‌రో చంద్రోద‌యాన్ని చూడ‌టం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు.

అలాగ‌ని పూర్తిగా అవ‌కాశం లేద‌నీ చెప్ప‌లేం. చంద్రయాన్-3లో ఉప‌యోగించిన ఏ ప‌రిక‌ర‌మూ మైన‌స్ 150 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లో ఉండి మ‌ళ్లీ ప‌నిచేయ‌లేవు. అవి మ‌ళ్లీ ప‌నిచేయాలంటే మ‌న‌కు కాస్త అదృష్టం కూడా ఉండాలి’ అని ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ ఎం.శంక‌ర‌న్ వెల్ల‌డించారు.

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ల మేల్కోలుపుకు యత్నం: ఇస్రో కీలక ప్రకటన

విధాత : చంద్రుడి ఉపరితలంపై వాతావరణ మార్పుల నేపధ్యంలో నిద్రావస్థలోకి వెళ్లిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్‌, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి ఇస్రో చేసిన ట్వీట్‌లో విక్రమ్ ల్యాండర్‌, ప్రజ్ఞాన్ రోవర్‌లు మేల్కోన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వాటితో కమ్యూనికేషన్ పునరుద్ధరణ ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. ఇప్పటి వరకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు లేదని, అయితే వాటితో తిరిగి సంబంధాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో పేర్కోంది.