విధాత: దళిత బంధు పథకాన్ని చూసి గర్వపడ్డానని అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ (Prakash Ambedkar) అన్నారు. అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం సమాజంలో ఒక కొత్త దిశను చూపించిందన్నారు. దళితబంధు పథకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.
అంబేద్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి అని అన్నారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్ భావజాలం అవసరమన్నారు. సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదన్నారు. సమాజంలో మార్పుకోసం, అంతరాలను రూపుమాపేందుకు అంబేద్కర్ అహర్నిశలు పాటుపడ్డారన్నారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారని తెలిపారు.
దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేద్కర్ ఆనాడు చెప్పారని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని అంబేద్కర్ చెప్పారన్నారు. పాక్, చైనాకు హైదరాబాద్ ఎంతో దూరంలో ఉందని, రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యం ఇంకా దూరంగానే ఉందని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. ఆదివాసీలు, దళితులు వృద్ధిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ మరోచరిత్రకు నాంది పలికిందన్నారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే ఆర్థిక అసమానతలను తొలగించొచ్చని అంబేద్కర్ నమ్మారని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. బలిదానాలు జరగకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి లేదన్నరు. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్ మద్దతు ఇచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగిందని, వందలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించిందని తెలిపారు.