ఉద్రిక్తత నడుమ.. ముగిసిన ప్రీతి అంత్యక్రియలు
విపక్షాలు, గిరిజన సంఘాల నిరసన గిర్ని తండాలో భారీ బందోబస్తు కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు నా బిడ్డను హత్యచేశారు: తండ్రి నరేందర్ విధాత: వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్రిక్తత నడుమ డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వగ్రామం గిర్ని తండాలో ముగిశాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనల మధ్య గిర్ని తండాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య అంతిమయాత్ర కొనసాగింది. విపక్షాలు, గిరిజన సంఘాల నిరసనల మధ్య ఈ కార్యక్రమం సాగింది. అంతిమయాత్ర, అంత్యక్రియలు […]

- విపక్షాలు, గిరిజన సంఘాల నిరసన
- గిర్ని తండాలో భారీ బందోబస్తు
- కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు
- నా బిడ్డను హత్యచేశారు: తండ్రి నరేందర్
విధాత: వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్రిక్తత నడుమ డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వగ్రామం గిర్ని తండాలో ముగిశాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనల మధ్య గిర్ని తండాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య అంతిమయాత్ర కొనసాగింది.
విపక్షాలు, గిరిజన సంఘాల నిరసనల మధ్య ఈ కార్యక్రమం సాగింది. అంతిమయాత్ర, అంత్యక్రియలు సాఫీగా పూర్తయ్యే విధంగా పోలీసులు తమ వంతు ప్రయత్నం చేశారు. ప్రీతి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 1.15 గంట సమయంలో గిర్నితండాలో పూర్తయ్యాయి. సంప్రదాయ పద్ధతిలో ప్రీతి మృతదేహాన్ని ఖననం చేశారు.
గిర్ని తండాలో విషాద ఛాయలు
ప్రీతి మృతితో జనగామ జిల్లా గిర్నితండాలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ నుండి భారీ భద్రత నడుమ ప్రీతి మృతదేహం గిర్నీతండాకు చేరుకోగానే కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోధించారు.
నా బిడ్డను హత్య చేశారు: తండ్రి నరేందర్ సంచలన ఆరోపణ
తమ బిడ్డను కక్షగట్టి హత్య చేశారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతికి సైఫే హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
తన కూతురు చావుకు కారణమైన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. కచ్చితంగా అది హత్యానని చెప్పారు.
తన బిడ్డ దేనినైనా ఎదురిస్తుందని అన్నారు. ప్రీతి నాకు ఫోన్ చేసి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం ఉందని చెప్పిన కొద్దిసేపటికే ఇది జరిగిందని అన్నారు. దీనికి కారణం అయిన సైఫ్ పై కఠిన చర్యలు చేపట్టాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు.
దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు పంపానని ఆయన పేర్కొన్నారు.ఎంజీఎం నుంచి నిమ్స్ వరకు ప్రతీది డ్రామానే క్రియేట్ చేశారని తల్లిదండ్రులు, బంధువులు మండిపడుతున్నారు.
విపక్షాల నిరసన – భారీ బందోబస్తు
మరోపక్క ప్రీతి మృతి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిర్ని తండాలో బిజెపి నాయకులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 90 రోజులలోపు నిందితుడికి శిక్ష విధించాలని కోరుతున్నాయి.
బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రీతి స్వగ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ, పలువురు గిరిజన సంఘాల నాయకులు,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీతికి కడసారి నివాళులు అర్పించారు.