Priyanka Gandhi | పిరికిపంద మోదీ.. నీ ఆటలు చెల్లవ్‌

ఏం చేసుకుంటావో చేసుకో నీలాంటి నియంత ముందు తలొంచేది లేదు మోదీ టార్గెట్‌గా ప్రియాంక వరుస ట్వీట్లు విధాత : ఒక అమరవీరుడి కొడుకును మోడీ భజన బృందం దేశ ద్రోహిగా అభివర్ణిస్తున్నదని రాహుల్‌గాంధీ సోదరి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఏం చేయగలరో చేసుకోండి.. కానీ.. ఒక పిరికిపంద, అధికార యావ ఉన్న మీ లాంటి నియంత ముందు గాంధీ కుటుంబం తల వంచదు’ అని నరేంద్రమోదీకి […]

  • Publish Date - March 24, 2023 / 01:25 PM IST
  • ఏం చేసుకుంటావో చేసుకో
  • నీలాంటి నియంత ముందు తలొంచేది లేదు
  • మోదీ టార్గెట్‌గా ప్రియాంక వరుస ట్వీట్లు

విధాత : ఒక అమరవీరుడి కొడుకును మోడీ భజన బృందం దేశ ద్రోహిగా అభివర్ణిస్తున్నదని రాహుల్‌గాంధీ సోదరి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఏం చేయగలరో చేసుకోండి.. కానీ.. ఒక పిరికిపంద, అధికార యావ ఉన్న మీ లాంటి నియంత ముందు గాంధీ కుటుంబం తల వంచదు’ అని నరేంద్రమోదీకి సవాలు విసిరారు.

రాహుల్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఆమె వరుస ట్వీట్లు చేశారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని అనుయాయులు తన కుటుంబాన్నే కాకుండా యావత్‌ కశ్మీరీ పండిట్ల సమాజాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక అమర వీరుడి కుమారుడిపై నరేంద్రమోదీ భజన బృందం దేశ ద్రోహి ముద్ర వేస్తున్నది’ అని మండిపడ్డారు. ‘నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీ గురించి రాహుల్‌ ప్రశ్నలు సంధించారు.

మీ స్నేహితుడు గౌతం అదానీ భారత పార్లమెంటుకంటే, భారతీయులకంటే ఎందుకు ఎక్కువై పోయారు? అదానీ దోపిడీ గురించి ప్రశ్నిస్తే ఎందుకు కంగారు పడుతున్నారు?’ అని మోదీని ఉద్దేశించి నిలదీశారు. మరొక ట్వీట్‌లో భారీ కుంభకోణాలకు పాల్పడిన వారి పేర్లను ప్రియాంక ప్రస్తావించారు.

‘నీరవ్‌ మోదీ కుంభకోణం .. 14వేల కోట్లు. లలిత్‌ మోదీ కుంభకోణం 425 కోట్లు. మెహుల్‌ చోక్సీ కుంభకోణం 13,500 కోట్లు అని ఆమె పేర్కొన్నారు. దేశాన్ని లూటీ చేసినవారిని కాపాడేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తున్నది? వారు ఎందుకు దేశం వదిలి పారిపోయారు? అని ఆమె ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారు లీగల్‌ కేసులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అవినీతిని బీజేపీ సమర్థిస్తుందా? అని నిలదీశారు. తన సోదరుడు నిజమైన దేశభక్తుడని కొనియాడిన ప్రియాంక.. అదానీ దోపిడీ గురించి ప్రశ్నించినందుకు రాహుల్‌గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు.

‘కుటుంబం కుటుంబం.. అంటారు. తెలుసుకో.. ఈ కుటుంబం తన రక్తాన్నిధారబోసి ప్రజాస్వామ్యమనే చెట్టుకు నీరుపోసింది’ అని మోదీని ఉద్దేశించి అన్నారు. దానిని మీరు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇదే గాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం తన గొంతు వినిపించిందని, తరతరాలుగా సత్యం కోసం పోరాడుతున్నదని పేర్కొన్నారు. ‘మా నరనరాల్లో ప్రవహించే నెత్తుటిలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది మీలాంటి పిరికిపంద ముందు, మీలాంటి అధికార యావ ఉన్న నియంత ముందు ఎన్నటికీ తలవంచదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ఘాటు పదాలతో ప్రియాంక సవాలు విసిరారు.