PRTUలో MLC ఓటమి ముసలం..! సస్పెన్షన్‌పై బిక్షం గౌడ్ వర్గీయుల తిరుగుబాటు.. నల్లగొండలో నిరసన దీక్ష..!

విధాత: పీఆర్టీయూ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ)లో హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి వ్యవహారం ముసలం రేపింది. ఆ జిల్లాల ఉపాధ్యాయ ఓటమికి నల్గొండ పీఆర్టీయూ అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్ కూడా ఒక కారణం అన్న ఆరోపణలతో ఆయనతోపాటు ఆరుగురు నాయకులను సంఘం నుంచి సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం కోసం పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం ఫైమన్ కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదికలో బిక్షం […]

  • Publish Date - April 1, 2023 / 05:31 PM IST

విధాత: పీఆర్టీయూ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ)లో హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి వ్యవహారం ముసలం రేపింది. ఆ జిల్లాల ఉపాధ్యాయ ఓటమికి నల్గొండ పీఆర్టీయూ అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్ కూడా ఒక కారణం అన్న ఆరోపణలతో ఆయనతోపాటు ఆరుగురు నాయకులను సంఘం నుంచి సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం కోసం పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం ఫైమన్ కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదికలో బిక్షం గౌడ్‌తో పాటు ఆరుగురు నాయకులు పీఆర్టీయూ ఓటమికి కారణమయ్యారని తేల్చి, వారిపై చర్యలకు సిఫారసు చేసింది. కమిటీ నివేదిక అనుసరించి పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ భిక్షంగౌడ్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అధ్యక్షతన మార్చి 31న ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, రాష్ట్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డిలు సమావేశమై ఫైమన్ కమిటీ నివేదికపై చర్చించి సంఘం ప్రాథమిక సభ్యత్వం నుంచి సుంకరి భిక్షంగౌడ్ ను, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జిల్లాకు చెందిన నల్ల మేకల వెంకటయ్యతో పాటు ఆరుగురిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా నల్గొండ జిల్లా ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కావడం గమనార్హం. పీఆర్టీయూ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకధాటిగా 14 సంవత్సరాలు పనిచేసిన బిక్షం గౌడ్ ప్రతిసారి సంఘం ఎన్నికల్లో విజయం సాధించి తనకున్న ఉపాధ్యాయ బలగంను చాటుకున్నారు.

అటువంటి భిక్షంగౌడ్ పై పీఆర్టీయూ నాయకత్వం వేటు వేయడాన్ని సంఘంలోని మెజారిటీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేవలం కొంతమంది సంఘం రాష్ట్ర నాయకులు తమ స్వార్థం కోసం నా ఎదుగుదలను ఓర్వలేక నాపై లేని నిందలు మోపి సస్పెండ్ చేయడం సరికాదని బిక్షం గౌడ్ వాదిస్తున్నారు.

వారు చెబుతున్నట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన ఏవిఎన్ రెడ్డి నుండి తాను 20 లక్షల తీసుకున్నట్లుగా రుజువు చేస్తే తాను కోటి రూపాయలు సంఘానికి ఇస్తానంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆడియో వీడియోలు ఉన్నాయని చెబుతున్న వారు వాటిని ఎందుకు బయట పెట్టడం లేదన్నారు.

కుటుంబంతో కలిసి తాను గర్భగుడిలో ప్రమాణం చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. తాను రాష్ట్ర కమిటీ లో ఉన్నవారికి పోటీ అవుతానని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా భవిష్యత్తులో ఎదుగుతానన్న ఆలోచనతో కొందరు నన్ను సంఘము నుండి తొలగించే కుట్ర చేశారన్నారు.

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తో తనకు విభేదాలు లేవని ఆయనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో నేను పోటీ అవుతానని ఆలోచన పెట్టుకుంటే దానిని ఆయన తొలగించుకోవాలని, తాను జిల్లా సంఘానికి పరిమితం అవుతానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి ప్రభుత్వంపై ఉపాధ్యాయులకు ఉన్న వ్యతిరేకతనే కారణమన్నారు. 26 వేలకు పైగా ఉన్న ఓటర్లలో 13,500 మంది ఓటర్లు మా వాళ్లు ఉన్నప్పటికీ వారు మమ్మల్ని నమ్మలేదని, మా నాయకులు ఉపాధ్యాయ పదోన్నతులపై ఇచ్చిన హామీలు అమలు చేయించలేకపోవడం కూడా ఉపాధ్యాయులు మాకు దూరం కావడానికి కారణమైందన్నారు.

యుటిఎఫ్ కూడా అధికార పార్టీతో వెళుతున్నందున వారిని కూడా నమ్మకుండా ప్రత్యామ్నాయం బిజెపి అన్న ఆలోచనతోనే వారు ఏవిఎన్ రెడ్డికి ఓటు వేశారని భావిస్తున్నామన్నారు. కాగా తన సస్పెన్షన్ను సవాలు చేస్తున్న బిక్షం గౌడ్ రేపు ఏప్రిల్ 2వ తేదీన నల్గొండ పీఆర్టీయూ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేయనుండగా ఆయనకు పలు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలకడంతో ఈ వ్యవహారం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.