విధాత : మెదక్‌లో బీఆరెస్‌కు స్థానికులు దొరకడం లేదా అని, గతంలో కరీంనగర్ నుంచి హరీశ్ రావును తీసుకొచ్చి ఇక్కడ రుద్దారని, ఆయన చాలదన్నట్లు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారని, ఆయనది ఏ జిల్లా.. ఏ ఊరో ఆయనకే తెలియదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ప్రజలను దోచుకున్నారని, ఇప్పుడు ఆ డబ్బు ఖర్చుపెట్టి ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు.
ఆయనకు ఇతరులను దోచుకోవడం తప్ప తెలిసిందేం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆరెస్, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా కనిపించడం లేదన్నారు. బీఆరెస్ రైతుల లక్ష రుణమాఫీ చేస్తామని, కాంగ్రెస్ 2లక్షల రుణమాఫీ చేస్తామని మాట తప్పాయని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి 90 రోజుల్లో రూ.9 వేల కోట్లు అప్పులు చేశారని, కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. రేవంత్‌రెడ్డి 17 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీ పోయి డబ్బులు తీసుకొస్తా అంటున్నారని, ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్‌లకు ఓటు వేస్తే నిజాంపేట చెరువులో మునిగినట్లేనని, దేశంలో మూడో సారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారని, బీజేపీ ఎంపీని గెలిపించుకోవడం ద్వారా దేశంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.