మెదక్ ప్రజల ఆశా, శ్వాసగా పనిచేస్తా
అబద్ధాలు ఆడటం హరీష్‌కు వెన్నతో పెట్టిన విద్య
విధాత; మెదక్ ప్రత్యేక ప్రతినిధి: బీఆరెస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ లాంటిదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొదట జైలుకు వెళ్లాల్సింది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావేనని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో నేడు బీఆరెస్ పార్టీ మొత్తం మునిగిపోతుందన్నారు.
తొందరగా టైటానిక్ షిప్‌లోనుంచి బీఆరెస్ నాయకులు బయటకు రావాలని సూచించారు. 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆరెస్ మొదటగా చేవెళ్ల రంజిత్ రెడ్డి పేరును ప్రకటించారు, రంజిత్‌రెడ్డి నుంచి కడియం కావ్య వరకు బీఆరెస్ నుంచి వెళ్లిపోతున్నారన్నారు. అధికారంలో ఉండగా అనేక అక్రమాలు చేసి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేసినోళ్లు నేడు సేవ చేస్తామని వస్తున్నారు, ప్రజలు ఆలోచించాలి అన్నారు.
తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ మెదక్ లో ఎంపీ పదవికి పోటీ చేయడానికి ఒక్కరూ దొరకలేదా అని ప్రశ్నించారు. మామను మించి అబద్ధాలు ఆడటం హరీష్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆనాడు జిల్లాలో 78 కేసులు పెట్టుకుని జై తెలంగాణ అన్నది రఘునందన్, అబద్ధాల పునాదుల మీద ఇంకా ఎన్నిరోజులు మాట్లాడుతారని ప్రశ్నించారు. నేను ఎవరి జోలికి పోను.. నా జోలికి వస్తే ఊరుకోనని రఘునందన్ హెచ్చరించాడు. తెలంగాణలో 17 స్థానాలు గెలిచి మోదీకి కానుకగా ఇస్తామన్నారు. బీఆరెస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 17 కోట్లు అని ఎమ్మెల్సీ అఫిడవిట్ లో చూపించారు. ఆలాంటిది నేడు 100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్త అంటున్నాడు. మీకు రాజపుష్పకు సంబంధం ఉందా లేదా అని చెప్పాలన్నారు. గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘునందన్ వెల్లడించారు.
మెదక్ ప్రజల శ్వాసగా పనిచేస్తా
మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తానని రఘునందన్ రావు తెలిపారు. ఇందిరా గాంధీ హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలు అయినా కాలేదని, కానీ ఐదేండ్లలోనే మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు లేకున్నా మెదక్ రైలు, మెదక్ మీదుగా జాతీయ రహదారులు, అనేక పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మెదక్ ఎన్నిక ఏకపక్షమే
మెదక్ ఎన్నిక ఏకపక్షమేనని రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆరెస్, కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీని ఓడించాలని కుట్ర పన్నుతున్నారన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తా అన్నారు. మెదక్ పేరు చరిత్రలో ఉండేలా చేస్తానని రఘునందన్ రావు వెల్లడించారు.