విధాత: రైలు (Train) కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు.. తాము ఎక్కాల్సిన రైలు వేరే ప్లాట్‌ఫాం మీద నుంచి అప్పటికే వెళ్లిపోయిందని తెలిస్తే ఎలా ఉంటుంది? కర్ణాటకలో కలబురగి జంక్షన్‌లో ఇలానే జరిగింది. దీనికి రైల్వే అధికారులు చెప్పిన సమాధానం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. హుబ్బళ్లి – సికింద్రాబాద్ (17319) రైలు కోసం చాలా మంది ప్రయాణికులు కలబురగి స్టేషన్‌లో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఈ రైలు 5:45కు ప్లాట్‌ఫాం నంబరు 1 పైకి వస్తుంది. దాంతో వారు ఆ ప్లాట్‌ఫాంపైనే ఉండి రైలు కోసం చూస్తున్నారు.
అయితే రైలు ఆలస్యం కావడంతో స్టేషన్ సిబ్బంది.. డిజిటల్ తెరలపై రైలు వచ్చే సమయాన్ని 6:32 అని తర్వాత 6:42 అని మార్చినా ప్లాట్‌ఫాం నంబరును మార్చలేదు. 6:45 తర్వాత ఆ రైలు డిజిటల్ తెరపై కనిపించడం మానేసింది. దీంతో ప్రయాణికులు విచారణ కేంద్రానికి వెళ్లి అడగగా.. రైలు 6:35కి వచ్చి 6:44కి వెళ్లిపోయిందని చల్లగా చెప్పారు. ఎనౌన్స్‌మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. తమ సిబ్బంది మర్చిపోయారని సమాధానమిచ్చారు.
ఈ ఘటనపై అంతర్గత విచారణ ఉంటుందని స్టేషన్ మేనేజర్ స్పష్టం చేశారు. అనంతరం సికింద్రాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులను హిమసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో అధికారులు సర్దుబాటు చేశారు. హుబ్బళ్లి – సికింద్రాబాద్ రైలుకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామని.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల దయాదాక్షిణ్యాలపై నిలబడి ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోయారు. మరోవైపు హిమసాగర్ రైలు హైదరాబాద్ డెక్కన్ స్టేషన్ వరకే వెళుతుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వీరంతా 8 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది.