భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర.. ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
విధాత: హిందూ దేవుళ్లలో సూర్యుడిది ప్రత్యేక స్థానం. కానీ ఆ దేవాలయాలు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. సూర్యదేవాలయం అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది కోణార్క్ సూర్య దేవాలయం. ఆంధ్ర ప్రదేశ్ లోని అరసవెల్లి సూర్య దేవాలయం కూడా ప్రముఖమైనదని చెప్పవచ్చు. వీటితో పాటు గుజరాత్‌లోని మోఢేరాలో కూడా సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయానికి కూడా చాలా చారిత్రక ప్రాశస్త్యం ఉంది. స్కంద, బ్రహ్మ పురాణాల్లో ఈ పుణ్యక్షేత్ర ప్రదేశ ప్రస్తావన ఉంది. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అహ్మదాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పుష్పవతి’ నదీ తీరాన మోడేరా దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్ సోలంకి అనే రాజు నిర్మించారు. తర్వాత కాలంలో సోమనాథ్ మరియు చుట్టు పక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ వైభవాన్ని కోల్పోతూ వచ్చారు.
అలాగే సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ‘అహిల్‌వాడ్ పాటణ్’ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని క్రమంగా కోల్పోనారంభించింది. తమ కీర్తిని, సంస్కృతిని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం కొంత మంది వ్యాపారులతో కలిసి అందమైన ఆలయాల నిర్మాణం ప్రారంభించారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు.
సూర్య ఆరాధనకు అందమైన ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అలా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో నాలుగు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండోది జమ్మూలో ఉన్న మార్తాండ్ ఆలయం, మూడోది ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లి. నాలుగోది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య దేవాలయం.
సున్నం లేకుండా నిర్మాణం..
ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడా సున్నం వినియోగించకుండా, ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా నిర్మించారు. మొదటిది గర్భగుడి కాగా రెండోది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు, వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలు. సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలతో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. పురాణాల్లోని ప్రధాన ఘట్టాలు గోడలపై చెక్కిన శిల్పాలను చూసి తరించవచ్చు.
స్తంభాల కింది భాగం చూస్తే అష్ట కోణాకారంలోను, పై భాగంలో చూస్తే గుండ్రంగా ఉండి కనువిందు చేస్తాయి. సూర్యోదయ సమయంలో తొలి సూర్య కిరణం ఆలయ గర్భగుడిలో ప్రవేశించడం మధురాను భూతిని కలిగిస్తుంది. సభా మండపానికి ఎదురుగా విశాలమైన పుష్కరిణి ఉంటుంది. దీనిని సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు.
అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను ఆనవాలు లేకుండా నాశనం చేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.
వేదాల్లో మోడేరా ప్రస్తావన
స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలను అనురించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టు పక్కల ప్రాంతాలను ‘ధర్మారణ్య’ అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మ హత్యాపాపం నుంచి బయట పడేందుకు పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని కోరగా, ‘ధర్మరాణ్య’ వెళ్లమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌ను చూడాలనుకునే వారు ఈ పురాతన ఆలయాన్ని కూడా మీ లిస్ట్‌లో పెట్టుకోవడం మరచిపోవద్దు.