Ratnachal case
విధాత: దాదాపు ఎనిమిదేళ్ల నాటి రైలు దగ్ధం కేసులో కాపునేఠా ముద్రగడ పద్మనాభం, తుని ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా తదితర 41 మంది మీద అప్పట్లో నమోదైన కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో పలువురు కాపు నాయకులూ, యువతకు ఊరట లభించినట్లు అయింది.
చంద్రబాబు పాలనలో అంటే కాపు రిజర్వేషన్లను కోరుతూ కాపులు గోదావరి జిల్లాల్లో భారీగా ఉద్యమించారు. ఆ పోరాటానికి సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించగా చలో తుని కార్యక్రమానికి 2016 జనవరి 31న పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే తునిలో భారీ బహిరంగ సభలో ముద్రగడ సహా పలువురు నాయకులు ప్రసంగించాల్సి ఉంది. ఈమేరకు గోదావరి, విశాఖ జిల్లాల నుంచి భారీగా కాపు యువత తుని బయల్దేరారు. సరిగ్గా అదే సమయంలో తుని స్టేషన్లో ఆగిఉన్న విశాఖ – విజయవాడ రత్నాచల్ (Ratnachal) ట్రైన్ మీద కాపు యువత ప్రతాపం చూపించి ట్రైన్ ను మొత్తం దగ్ధం చేసారు. ఇంజిన్ సహా మొత్తం భోగీలు దగ్ధం అయ్యాయి. కొద్దీ నిముషాల్లోనే తుని స్టేషన్ రణరంగం ఐంది.
పోలీసుల లాఠీ ఛార్జ్… కాపు యువత నినాదాలతో ఆ ప్రదేశం యుద్ధ రంగాన్ని తలపించింది. ఆ ఘటనలో పలువురు కాపు యువకులమీద అప్పటి టిడిపి చంద్రబాబు సర్కారు కేసులు నమోదు చేసింది. పెద్ద సంఖ్యలో యువకులు, నాయకులూ అరెస్ట్ అయ్యారు.
ఇన్నాళ్లుగా ఆ కేసు నిమిత్తం కోర్టుల చుట్టూ తిరిగిన కాపు యువకులు, ఇంకా ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా తదితరులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే జగన్ సర్కార్ వచ్చాక మొత్తానికి ఇన్నాళ్లు విచారణ అనంతరం కేసు కొలిక్కి వచ్చింది. సరైన ఆధారాలు లేనందున విజయవాడ రైల్వే కోర్టు ఆ కేసును కొట్టేసింది. దీంతో కాపు యువతకు చాలామందికి రిలీఫ్ దొరికింది.
ఇదిలా ఉండగా ఇందులో కూడా రాజకీయ కోణం కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం, అసలే పవన్ కళ్యాణ్ టిడిపితో జతకట్టిన వేళ కాపులను ప్రసన్నం చేసుకునే నిమిత్తం ఈ కేసును ప్రభుత్వం నీరుగార్చింది అని కూడా అంటున్నారు.
ఈ కేసు మాఫి ద్వారా కాపుల మద్దతు పొందడమే జగన్ లక్ష్యం అని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అందుకే ఇన్నాళ్లుగా కేసును నానబెట్టి ఇప్పుడు ముగింపునకు తీసుకొచ్చారని అంటున్నారు. ఏదైతేనేం ఇన్నేళ్ళుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాపు కుర్రాళ్లకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది.