ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామి నాథన్ కన్నుమూత


భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ (97) గురువారం కన్నుమూశారు. ప్రస్తుతం చెన్నైలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. ఒకానొక దశలో అల్పాదాయాలతో కునారిల్లుతున్న భారత వ్యవసాయానికి స్వామినాథన్ (M.S. Swaminathan) ఊపిరిలూదారు. అధిక ఉత్పత్తులనిచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టించడం ద్వారా రైతుల ఆదాయాలు పెరగడానికి తీవ్ర కృషి చేశారు.
వ్యవసాయ శాస్త్రవేత్తగానే కాక, వృక్ష జన్యు పరిశోధకుడిగా, మానవతావాదిగా అనేక ప్రసిద్ధి చెందారు. ఆయన సేవలకు గుర్తుగా 1987లో అత్యున్నతదమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. అనంతరం చెన్నైలోనే ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్‌ను పెట్టి పరిశోధనలు కొనసాగించారు.
రామన్ మెగసెసె అవార్డు (1971), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు (1986) వంటి పురస్కారాలూ ఆయనను వరించాయి. భారతదేశంలో సాగు అనే అంశం ఎక్కడ వచ్చినా వెంటనే వచ్చే పేరుగా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆయనకు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మథుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు.
ధర నిర్ణయం రైతుకే ఉండాలి
దేశంలో ఇప్పటికీ ఎక్కువమంది జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయరంగమే. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో అప్పటి ప్రభుత్వం ఆ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆశించిన వృద్ధి రేటు కన్నా ఎక్కువే లక్ష్యాన్ని సాధించింది. ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇచ్చినా వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అందుకే ఆ రంగంపై ఇప్పటికీ అధిక శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్నది. నాటి పాలకులు తీసుకున్న విధానాల వల్లనే దేశం స్వయం సమృద్ధి సాధించగలిగింది.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, పండిన పంటలకు కనీస మద్దతు దక్కకపోవడం వంటి కారణాలతో ఈ రంగాన్ని చాలామంది రైతుల వదిలి ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు. వ్యవసాయం లాభదాయకంగా లేనందునే తల్లిదండ్రులు వారి పిల్లలను వ్యవసాయ రంగంవైపు రావడానికి ఇష్టపడటం లేదు. అందుకే సేద్యం ఒకటే చాలదు.. వ్యవసాయ అనుబంధ అభివృద్ధి అంశాలూ చాలా ముఖ్యం.
ఆ రంగాల అభివృద్ధి కోసం కృషి చేస్తే యువ రైతులు కూడా ఈ రంగంలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ.. వ్యవసాయ అనుకూల విధానాలు అమలుచేస్తే ఐటీ రంగంలోనే కాకుండా వ్యవసాయంలోనూ మన దేశం ఔట్ సోర్సింగ్ సేవలు అందించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గురువారం దివంగతులైన హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తరచూ నొక్కి చెప్పేవారు.
ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. సేవల రంగం విస్తరించింది. పారిశ్రామికరంగంలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పనిచేసినా ఆర్థికంగా లాభమా? కాదా? అన్న విషయం ప్రస్తుతం యువతను ప్రభావితం చేస్తున్నది.
ఉన్నత చదువులు చదివిన యువత.. హుందాతనంతో కూడుకున్న జీవితాన్ని కోరుకుంటున్నది. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నది.
అన్నిరకాల అవసరాలు తీరేలా ఆదాయం అవకాశాలు వ్యవసాయరంగంలో లేవు. అందుకే ఈ రంగం పట్ల యువత ఆసక్తి చూపడం లేదు. అయితే వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాల పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే పరిస్థితి మారుతుంది.
అంతేకాదు.. మన వ్యవసాయ విద్యా విధానం వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నది. స్వామినాథన్ అన్నట్టు.. మన విద్యార్థుల్లో చాలామందికి.. రైతుల సమస్యలు ఏమిటో తెలియదు. ఆయన సూచించినట్టు.. అగ్రికల్చర్ విద్యార్థులు.. వానకాలం.. లేదా యాసంగి.. ఒక సీజన్ మొత్తం రైతులతో గడిపితే.. వారికి వ్యవసాయంలోని అసలు సమస్యలు తెలుస్తాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు అనుభవంలోకి వస్తాయి.
ప్రస్తుతం వ్యవసాయరంగంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ప్రధానమైంది కనీస మద్దతు ధర. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కేంద్రం ఏటా పంటలకు ప్రకటించే మద్దతు ధరల విషయంలో అన్నిరాష్ట్రాల్లో సాగయ్యే పంటలను, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పంటల మద్దతు ధరల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలపై మమకారం, దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపెడుతున్నది. దీన్ని విడనాడాల్సిన తక్షణావసరం ఉన్నది.
అలాగే.. దేశమంతా ఒకే మార్కెట్ ఉంటే అప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల తరలింపుపై ఆంక్షలు ఉండవు. ఒకే మార్కెట్ విధానం తెస్తే అవినీతి చాలా వరకు తగ్గుతుందన్న స్వామినాథన్ చేసిన సూచనను అమలు చేస్తేనే వ్యవసాయ రంగానికి తిరిగి మంచి రోజులు వస్తాయని వ్యవసాయ శాస్త్రత్తలు, రైతు సంఘాల నేతలు అంటున్నారు.
కరువు లేని సమాజ స్థాపన మనకు చాలా అవసరం. ప్రతీ ఒక్కరికీ తగినంత ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో నాటి యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే ఉపాధి హామీ పథకాన్ని కూడా తెచ్చింది. దీంతో ఉన్న ఊళ్ళలోనే ఉపాధి లభించడంతో.. కొంత వరకు వలసలకు అడ్డుకట్ట పడింది.
కానీ.. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాలను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఏటా ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో నిధులను తగ్గిస్తున్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం.. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టడానికి మూడు నల్ల చట్టాలను తెచ్చింది.

ఈ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు రైతులంతా ఏడాదికి పైగా అలుపెరగని పోరాటం చేశారు. రైతు తాను పండించిన పంటకు తానే మద్దతు ధర నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇవ్వటం.. మొత్తంగా కరువులేని సమాజాన్ని సాకారం చేయడమే స్వామినాథన్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి.