Revanth, Pawan | నేత‌ల పెద‌వి ఓటుకు చేటు

Revanth , Pawan పెద‌వి దాటిందా ఇమేజ్‌ గోవిందా! పంచ్‌లు వేస్తామంటే పంచెలూడిపోతాయ్‌ ప్రాస‌ల కోసం చూస్తే గోస‌ప‌డాల్సిందే నిన్న ప‌వ‌న్‌, నేడు రేవంత్‌ పార్టీల ఇమేజ్‌కు డ్యామేజ్‌ విధాత‌: రాజ‌కీయ నాయ‌కులు ముఖ్యంగా బాధ్య‌తాయుత ప‌ద‌వుల్లో ఉన్న‌వారు ప్ర‌తిమాటా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే దాని ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌నే పెద్ద‌ల మాట ఎవ‌రి విష‌యంలో ఏమోగానీ రాజ‌కీయ నాయ‌కుల విష‌యంలో మాత్రం క‌చ్చితంగా స‌రిపోతుంది. ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ […]

Revanth, Pawan | నేత‌ల పెద‌వి ఓటుకు చేటు

Revanth , Pawan

  • పెద‌వి దాటిందా ఇమేజ్‌ గోవిందా!
  • పంచ్‌లు వేస్తామంటే పంచెలూడిపోతాయ్‌
  • ప్రాస‌ల కోసం చూస్తే గోస‌ప‌డాల్సిందే
  • నిన్న ప‌వ‌న్‌, నేడు రేవంత్‌
  • పార్టీల ఇమేజ్‌కు డ్యామేజ్‌

విధాత‌: రాజ‌కీయ నాయ‌కులు ముఖ్యంగా బాధ్య‌తాయుత ప‌ద‌వుల్లో ఉన్న‌వారు ప్ర‌తిమాటా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే దాని ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌నే పెద్ద‌ల మాట ఎవ‌రి విష‌యంలో ఏమోగానీ రాజ‌కీయ నాయ‌కుల విష‌యంలో మాత్రం క‌చ్చితంగా స‌రిపోతుంది. ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కానీ, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికానీ అసంద‌ర్భంగా అన్నారో, అనాలోచితంగా అన్నారో, కావాల‌ని అన్నారో తెలియ‌దుకానీ ఆ వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌తంగా వారికేకాదు, ఆయా పార్టీల‌కూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

వారాహియాత్ర -2లో భాగంగా ఏలూరులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వం కోసం ప‌నిచేస్తున్న వాలంటీర్ల‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో సుమారు 30 వేల మంది మ‌హిళ‌లు క‌నిపించ‌డం లేద‌ని, వాలంటీర్ల ద్వారానే సంఘ విద్రోహ‌శ‌క్తుల‌కు ఇలాంటి స‌మాచారం చేరుతోంద‌ని ఆరోపించారు.

గ్రామాల్లో ఒంట‌రి మ‌హిళ‌లు ఎవ‌రు, భ‌ర్త చ‌నిపోయిన‌వారు ఎవ‌రు, బాలిక‌లు ఎంత మంది ఉన్నారు, వారు ఎవ‌ర్నైనా ప్రేమిస్తున్నారా? మ‌హిళ‌లు ఎవ‌రు ఎవ‌రితో ఉన్నారు, వారి ఫోన్ నంబ‌ర్లు ఏంటి అనే వివ‌రాల‌న్నీ వాలంటీర్లు సేక‌రిస్తున్నార‌ని, ఇవ‌న్నీ సంఘ విద్రోహ‌శక్తుల‌కు ఆయుధంగా మారాయ‌ని, త‌ద్వారా హ్యూమ‌న్ ట్రాఫికింగ్ జ‌రుగుతోంద‌ని త‌న‌తో కేంద్ర నిఘా వ‌ర్గాలు చెప్పిన‌ట్లు ప‌వ‌న్ ఆరోపించారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే కాదు, జ‌న‌సేన పార్టీకి కొంత న‌ష్టం క‌లిగించింద‌నే చెప్పాలి.

ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో సుమారు 3 ల‌క్ష‌ల‌మంది వాలంటీర్ల‌ను నెల‌కు 5 వేల రూపాయ‌ల వేత‌నంతో జ‌గ‌న్ నియ‌మించారు. గ్రామంలోని ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక వాలంటీర్ ఉన్నారు. వీరిలో చాలామంది ప‌ది నుంచి డిగ్రీ మ‌ధ్య చ‌దివిన‌వాళ్లు.

వైసీపీ ప్ర‌భుత్వం కోసం ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం ఉన్న‌వాళ్లూ వారిలో కోకొల్ల‌లు. వైఎస్ జ‌గ‌న్‌ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేస్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడే చాలా డైలాగుల‌ను ఇంట్లో టీవీల్లో, మొబైల్స్‌లో చూసుకుని న‌వ్వుకునే వాలంటీర్లు ఉన్నారు. అలాంటి వాలంటీర్ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడూ ఈ ఓటు బ్యాంకును మొత్తంగా జ‌గ‌న్‌కు అప్ప‌గించిన‌ట్ల‌యిందంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు రోడ్ల‌పైవ‌చ్చి నిర‌స‌న తెలిపారు. దిష్టిబొమ్మ‌ల‌ను త‌గుల‌పెట్టారు. కొన్నిచోట్ల చెప్పుల‌తో కొట్టారు. మ‌హిళా వాలంటీర్లు అయితే ఏకంగా మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మ‌హిళా క‌మిష‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. నోరు జారిన విష‌యాన్ని, దాని ప‌ర్య‌వ‌సానాల‌ను చూసిన త‌రువాత అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వ్యాఖ్య‌లు బాధించి ఉంటే క్ష‌మించాల‌ని, త‌న ఉద్దేశం ఏదో స్ప‌ష్టంగా చెప్పాల్సి ఉండ‌గా, మ‌రోసారి అదే వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు, వాలంటీర్ల‌లో సంఘ విద్రోహ‌శ‌క్తులు ఉన్న జాబితా అంటూ కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను విడుద‌ల చేశారు.

దీంతో ఇన్నాళ్లు విడివిడిగా, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై లోలోప‌ల అసంతృప్తిగా ఉన్న వాలంటీర్లంతా ఏక‌తాటిపై వ‌చ్చేలా చేశారు. ఇది జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా తెలివిగా వాడుకుంది. వారంద‌రినీ రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలిపేలా ప్ర‌ణాళిక వేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చినా, ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకునే చంద్రబాబు వ‌చ్చినా తమ ఉపాధికి గండిప‌డుతుంద‌నే భ‌యాన్ని ప‌వ‌న్ త‌న వ్యాఖ్య‌ల ద్వారా వాలంటీర్ల‌లో, వారి కుటుంబాల్లో క‌లిగించారు. ఇది రాజ‌కీయంగా ఆయ‌న వేసిన పెద్ద త‌ప్ప‌ట‌డుగు అని రాజ‌కీయ పరిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ రేపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇద్ద‌రికీ ఈ వివాదం న‌ష్టం చేస్తుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

బ‌డాయి తెచ్చిన చేటు

ఇక టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తానా స‌భ‌ల్లో రెండు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ద‌ళితుల‌కు డిప్యూటి సీఎం పోస్టు ఇస్తారా అన్న ఒక ప్ర‌శ్న‌కు రేవంత్‌రెడ్డి ఏమో చెప్ప‌లేం…రేపు సీత‌క్క సీఎం కూడా కావొచ్చు అంటూ అన‌వ‌స‌ర ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఇది ఒక ర‌కంగా కాంగ్రెస్‌లో సీనియ‌ర్ లీడ‌ర్‌గా ఉన్న మ‌రో ద‌ళిత నేత భ‌ట్టీ విక్ర‌మార్క‌కు మ‌న‌స్తాపం క‌లిగించేదే. అంత‌టితో ఆగ‌కుండా మ‌రుస‌టి రోజు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై ప్రాస‌ల‌కు, పంచ్‌ల‌కు పోయి ఇరుక్కున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే, కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ట్లు రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తారా అన్న ప్రశ్న‌కు, తెలివైన నాయకుడైతే… మా విధానాన్ని వ‌రంగ‌ల్ రైతు డిక్ల‌రేష‌న్‌లో ప్ర‌క‌టించాం… దానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పి ఉండ‌వ‌చ్చు. కానీ రేవంత్‌రెడ్డి నోరు జారారు.

తెలంగాణ‌లో 95 శాతం రైతులు 3 ఎక‌రాల‌లోపు ఉన్న‌వారేన‌ని, ఎక‌రం నీళ్లు పారేందుకు గంట క‌రెంటు చాల‌ని, అలా మూడెక‌రాల‌కు 3 గంట‌ల క‌రెంటు చాల‌ని చెప్పారు. ఆ క్ర‌మంలోనే వ్య‌వ‌సాయానికి 8 గంట‌ల క‌రెంటు స‌రిపోతుంద‌ని, కేసీఆర్ క‌మీష‌న్ల కోస‌మే 24 గంట‌ల క‌రెంటు పేరుతో దోపిడీ చేస్తోంద‌న్నారు. ఇది సుమారు 65 ల‌క్ష‌ల మంది రైతుల‌ను ప్ర‌భావితం చేసే వ్యాఖ్య‌.

ఇర‌వైనాలుగు గంట‌ల విద్యుత్ ఇవ్వ‌డంలో కొన్ని స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ రైతాంగం ఎప్పుడంటే అప్పుడు పొలాల‌కు నీరు పెట్టుకునే స్వేచ్ఛ‌ను అనుభ‌విస్తున్న‌ది. అంత పెద్ద జ‌నాభాకు సంబంధించిన అంశం మాట్లాడేట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి? కానీ రేవంత్‌రెడ్డి తొంద‌ర‌పాటులో నోరు జారారు. మూడు గంట‌ల సంగ‌తి అలా ఉంచినా ఎనిమిది గంట‌ల ఉచిత విద్యుత్ స‌రిపోతుంది అన్న మాట‌ను కూడా రైతులు ఇప్పుడు అంగీక‌రించ‌రు.

అందుకే బీఆర్ఎస్ నేత‌లు చాలా వేగంగా, తెలివిగా రేవంత్ వ్యాఖ్య‌ల‌ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో కాస్త గ్రాఫ్ పెరుగుతోంద‌న్న వాతావ‌ర‌ణంలో రేవంత్ వ్యాఖ్య‌లు రైతుల్లో అయోమ‌యం సృష్టించాయి. దీంతో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్‌లో ప‌డింద‌ని గ్ర‌హించి, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు దానిపై వ‌రుస‌గా ప్రెస్‌మీట్లు పెట్టి వివ‌ర‌ణ‌లు ఇచ్చుకున్నారు.

అస‌లు వీడియో ఇది అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ అప్ప‌టికే బీఆర్ ఎస్ వ్యూహం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లిపోయింది. మూడు గంట‌లు చాలు అన్న వ‌ర‌కు రేవంత్ మాట్లాడిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. దాంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.

ఢిల్లీ స్థాయిలో ప్రెస్‌మీట్లు పెట్టి, 24 గంట‌ల ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ పార్టీ క‌ట్టుబ‌డి ఉంది అని ప‌దే ప‌దే చెప్పాల్సిన ప‌రిస్థితి దాపురించింది.

రాజ‌కీయ నాయ‌కులు, బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉన్న‌వారు నాలుక‌ను ఎంత పొదుపుగా వాడితే అంత మంచిదంటారు. పీవీ న‌ర‌సింహారావులాంటి మ‌హా త‌ల‌పండిన రాజ‌కీయ మేధావులే.. ఏ విష‌యాన్నైనా మీడియా ప్ర‌శ్నిస్తే… చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని త‌ప్పించుకునేవారు. మ‌న్మోహ‌న్ సింగ్ అయితే నోట్లో మాట వ‌చ్చేది కాదు.

సోనియాగాంధీ కూడా అతి పొదుపుగా, ఆచితూచి మాట్లాడేవారు. కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులైతే వారి ప‌ద‌వీ కాలం మొత్తంలో ఒక‌టి రెండు సార్లు కూడా స‌మ‌స్య‌ల‌పైకానీ, మీడియా ప్రెస్‌మీట్ల‌లో కానీ మాట్లాడేవారు కాదు. ఒక‌వేళ మాట్లాడినా.. వారు చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయేవారే త‌ప్ప‌… మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చేవారు కాదు.

నోరు జాగ్ర‌త్త‌గా పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్లే ఒక‌ప్పుడు 146 దేశాల్లో అత్యంత గౌర‌వం పొందిన కేఏ పాల్ ఈరోజు ఎంట‌ర్‌టైన్‌మెంట్ స్టార్‌గా మారారు. నోరు జాగ్ర‌త్త‌గా లేక‌పోవ‌డం వ‌ల్లే తెలుగు రాజ‌కీయాల్లో చాలామంది క‌నుమ‌రుగైపోయారు.