తన భార్య మాదిరిగా.. ఫింగర్స్ క్రాస్ పెట్టి సర్‌ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం రోజు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించి పాకిస్థాన్ జట్టుని కేవలం 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ చేసింది.
తొలి రెండు వికెట్లు తొందరగానే పడిపోగా, ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే బాబర్ ఔటయిన తర్వాత వికెట్స్ వెంటవెంటనే పడిపోయాయి. ఈ క్రమంలో 191 పరుగులకి పాక్ కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, వన్డేల్లో 300 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. అతని కంటే ముందు షాహిదీ ఆఫ్రిదీ 351, క్రిస్ గేల్ 331 వన్డే సిక్సర్లతో ముందున్నారు.
అయితే ఓవరాల్‌గా చూస్తే మాత్రం 555+ అంతర్జాతీయ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్‌కి అమిత్ షాతో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ల సతీమణులు సైతం హాజరయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సతీమణులు ప్రీతీ నారయణ్, రివాబా జడేజా తళుక్కున మెరిసారు.
అనుష్క శర్మ, రితికా వైట్ కలర్ డ్రెస్‌లో ప్రత్యక్షం కాగా, అశ్విన్ సతీమణి ప్రీతి నారయణ్ మోడర్న్ డ్రెస్స్‌ల్లో బ్లాక్ గాగుల్స్‌తో కనిపించింది. జడేజా వైఫ్ మాత్రం సంప్రదాయ చీరకట్టులో సాధారణ మహిళలా కనిపించి అందరిని ఆకట్టుకుంది. గుజరాత్ ఎమ్మెల్యే అయిన రివాబా జడేజా.. తాను ఓ ప్రజాప్రతినిధిని అనే విషయాన్ని వస్త్రధారణలో చూపించి అందరిని ఆశ్చర్యపరచింది.
ఇక ఇదిలా ఉంటే రోహిత్ సతీమణి రితికా ఎప్పుడు కూడా మ్యాచ్ చూసే సమయంలో తన చేతి ఫింగర్స్‌ని క్రాస్ పెట్టి కూర్చుంటుంది. ఇది చాలా సార్లు కెమెరాలో రికార్డ్ కావడంతో పాటు రోహిత్ కూడా దీనిపై స్పందించాడు. మ్యాచ్ చూస్తున్నప్పుడు అలా తనకు అలవాటు అని చెప్పాడు. అయితే పాక్‌తో మ్యాచ్ ముగిసాక రోహిత్ గ్రౌండ్‌లోకి వచ్చి రితికాని చూస్తూ తన ఫింగర్స్‌ని క్రాస్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.