న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసు విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీకి ఇచ్చింది కూడా నాగ్‌పాల్ కావడం గమనార్హం. ఆయన స్థానంలో జస్టిస్ కావేరీ బవేజాను నియమించారు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో జడ్జి బదిలీకావడం సంచలనం రేపింది. తీస్ హజారి కోర్టులో డిస్ట్రిక్ జడ్జి (కమర్షియల్ కోర్టు)-13 సెంట్రల్‌గా జడ్జి నాగ్‌పాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు మొదలైన దగ్గర నుంచీ జడ్జి నాగ్‌పాల్ విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితర ప్రముఖులు ఈ కేసులో అరెస్టయి ఉన్నారు. సిసోడియా జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బదిలీల జాబితాలో నాగ్‌పాల్ సహా 27 మంది జడ్జిలు ఉన్నారు.
తల్లీ కొడుకులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ఒక వైపు ఈడీ విచారణను ఎదుర్కొంటూనే ఇంకోవైపు న్యాయపోరాటం సాగిస్తున్నారు. తన తల్లిని, కుమారుడిని కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతూ కవిత తరఫున ఆమె న్యాయవాదులు మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. మంగళవారం నలుగురు, బుధవారం నలుగురు చొప్పున కవితను కలిసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిని కలుసుకునేందుకు న్యాయస్థానాన్ని కవిత అనుమతి కోరారు. ఈడీ కస్టడీకి అనుమతించిన శనివారం రోజు భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు, సోదరులు పీ శ్రీధర్, ప్రణీత్ కుమార్, పీఏ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న ఏడు రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బంధువులను కలుసుకునేందుకు కవితకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని మంగళవారం కవిత తాజా పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ముందుగా అనుమతించిన వారిలో కేటీఆర్ పేరుతో పాటు తల్లి, కుమారులు, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.
సుప్రీంలో పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కవిత ఉపసంహరించుకున్నారు. ఇదే కేసులో ఈడీ ఇప్పటికే అరెస్టు చేయడంతో.. పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. చట్టప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని చౌదరి తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను జారీ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిన్ దాఖలు చేశారు. కాగా కవిత అరెస్టు అక్రమం అంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాదన వినేందుకు అంగీకరించింది.
ఆధారాలతో కొనసాగిన కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్‌కు 100కోట్ల ముడుపులతో పాటు లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై కస్టడీలో ఉన్న కవితను విచారిస్తున్న ఈడీ మంగళవారం ఆధారాలను ముందుపెట్టి ఒక్కోక్క దానిపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈనెల 23వరకు కవితను ఈడీ విచారించనుంది.