Rythu Bandhu | 3426.16 కోట్ల రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమ
రైతుబంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. ఈ లెక్కల్లో ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది

- నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు 53.60 లక్షలు
- సోమవారం నుంచి 4 ఎకరాల పై బడిన రైతులకు చెల్లింపులు
- ఈ నెలలోనే పూర్తి చెల్లింపులు
Rythu Bandhu | విధాత: రైతుబంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. ఈ లెక్కల్లో ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. రాష్ట్రంలో 53.60 లక్షల మంది రైతుల పేరిట 68.52 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఇందులోనూ అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే 22,24,910 మంది ఉన్నారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు 17,72,675, మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు 11,30,788 మంది ఉన్నారు. కొంత మంది బడా బాబులు వందల ఎకరాలు తమ వద్ద ఉంచుకొని అవి బయటకు తెలియకుండా రైట్ టూ ప్రైవసీలో పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటున్నారు. రాష్ట్రంలో నాలుగు ఎకరాల కమతంలోపు ఉన్న53.60 లక్షల మంది రైతులకు కేవలం 68.52 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. దాదాపు మరో 15 లక్షల మంది రైతుల వద్ద 80 లక్షల ఎకరాల పైచిలుకు వ్యవసాయ భూమి కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది.
53.60 లక్షల మంది రైతులకు
యాసంగి పంట సహాయానికి ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు వరకు భూమి ఉన్న 53.60 లక్షల మంది రైతులకు రూ. 3426.16 కోట్ల రైతు బంధు ఇచ్చారు. ఈ మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ విషయం రైతు బంధు నిధుల విడుదల లెక్కల్లో స్పష్టమవుతోంది. రాష్ట్రంలో చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారన్న విషయం రైతు బంధు లెక్కల ద్వారా వెలుగు చూస్తోంది.
చిన్న రైతులు అత్యధికంగా నల్లగొండలో
రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3,80,508 రైతులకు రూ.255.72 కోట్లు ఆ తరువాత ఖమ్మం జిల్లాలో 2,60,810 మంది రైతులకు రూ.164.81 కోట్ల సొమ్ము రైతు బంధు జమ అయింది. రియల్ ఎస్టేట్ కారణంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా వ్యవసాయం జరుగుతోంది. వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేశాయి. ఫలితంగా ఈ జిల్లాలో సాగు భూమి చాలా తక్కువగా ఉంది. అతి తక్కువగా ఈ జిల్లాల్లో 29,730 మంది రైతులకు రూ.14.58 కోట్ల రైతు బంధు అందింది. అలాగే అడవులు అత్యధికంగా ఉన్న ములుగు జిల్లాలో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న అనేక ఎకరాల పోడు భూములకు రైతు బంధు రావడం లేదు. దీంతో అతి తక్కువగా 63,110 మంది రైతులకు రూ.42.38 కోట్ల రైతు బంధు సొమ్ము జమ అయింది. ఈ మేరకు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద నగదును జమ చేసింది.
ఈ నెలలోనే రైతు బంధు జమ
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉండడంతో తాత్కాలికంగా రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం నెమ్మదించింది. ఈ మేరకు జనవరి 31 ఫిబ్రవరి 1వ తేదీలలో రైతు ఖాతాలో జమ చేయలేదని తెలిసింది. తిరిగి సోమవారం నుంచి రైతు బంధు డబ్బులను 4 ఎకరాల పైచిలుకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాలుగు ఎకరాల పై బడిన భూమి ఉన్న రైతుల సంఖ్య తక్కువగానే ఉంటుంది కానీ భూమి విస్తీర్ణం అత్యధికంగా ఉంటుంది. రాష్ట్రంలో సాగు అవుతున్న భూమిలో ఎక్కువ శాతం భూమి ఈ రైతుల వద్దనే ఉంది. దాదాపు 80 లక్షల ఎకరాల భూమికి ఇంకా రైతు బంధు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి నెలలోనే రైతులందరికీ రైతు బంధు నగదు జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.