న్యూఢిల్లీ : జైపూర్ విద్యుత్తు వితరణ్ నిగం ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్ కేసు లిస్టు చేయకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసును లిస్టు చేయకుండా రిజిస్ట్రీని ఎవరు ఆపుతున్నారని సందేహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కేసులో జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ తరఫున దవే వాదిస్తున్నారు. అదానీ విద్యుత్తు కేసును లిస్ట్ చేయడంలో రిజిస్ట్రీ వైఫల్యం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో జుడిషియల్ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు. హైకోర్టుల్లో ఇటువంటి జాప్యాలు జరగకుండా చూడాలని ఆయన నొక్కి చెప్పారు.
లిస్టు చేయొద్దని అసిస్టెంట్ రిజిస్ట్రీకి ఆదేశాలున్నాయట.
ఈ కేసును లిస్టు చేయవద్దని తనకు సూచనలు అందాయని అసిస్టెంట్ రిజిస్ట్రీ చెబుతున్నారని దవే కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని అసిస్టెంట్ రిజిస్ట్రీ చాలా ధైర్యంగా చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని, ‘ఎందుకు? ఎవరి కోసం? ఎవరు ఆదేశాలు ఇచ్చారు?’ అని ప్రశ్నించింది. ‘నాకు తెలియదు. ఇది ఇబ్బందికరమైనది మిలార్డ్. అసలు కోర్టులో ఏం జరుగుతున్నది? కోర్టు ప్రతిపాదిస్తే.. రిజిస్ట్రీ తిరస్కరిస్తున్నది.
హైకోర్టుల్లో ఇది అసాధ్యం. ప్రభుత్వమే ఆ పని చేస్తున్నట్టయితే అది ఉల్లంఘన కిందికే వస్తుంది. కానీ.. కోర్టు ఉత్తర్వులను రిజిస్ట్రీ ఉల్లంఘిస్తే దానిని తీవ్రంగా పరిగణించవద్దా?’ అని దవే ప్రశ్నించారు. ఈ విషయంలో జుడిషియల్ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనికి జస్టిస్ బోస్ స్పందిస్తూ తాము విషయం కనుగొంటామని తెలిపారు. ఈ రోజే ఈ అంశాన్ని పరిష్కరించాలని దవే విజ్ఞప్తి చేశారు. అనంతరం సదరు కేసును జనవరి 24న లిస్టు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. ఆ సమయానికి కోర్టులో ఉన్న మరో పిటిషనర్.. తాను సైతం ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నానని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘నేను దాఖలు చేసిన పిటిషన్ 20 కోట్ల మంది ప్రజలకు సంబంధించినది. దీనిని విచారణకు స్వీకరించాలి. ఇది రెండు వారాల్లో లిస్టు కావాల్సింది. కానీ.. ఇంత వరకూ ఎందుకు లిస్టు కాలేదు? అని సదరు పిటిషనర్ వాపోయారు. ‘తేదీ ప్రకటించినా ఇలా ఎందుకు జరుగుతున్నది? మేం దీనిని వచ్చ బుధవారం వాదనలు వింటాం’ అని కోర్టు పేర్కొన్నది.