విధాత: అందరం ఎన్నికలను ఎదుర్కొందామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) తన ప్రత్యర్థి ఏక్‌నాథ్‌షిండే, బీజేపీకి సవాల్ విసిరారు. శివసేనలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
గురువారం ముంబైలో ఉద్దవ్ మీడియాతో మాట్లాడుతూ.. అందరం ఎన్నికలను ఎదుర్కొందాం. అప్పుడు ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారు. నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగానే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా నైతిక కారణాలతో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయలని లేనిపక్షంలో మరోసారి తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తేల్చి చెప్పారు.
దేశంలో నంగా నాచ్ వ్యవహారం..
స్పీకర్ గడువులోగా నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉద్దవ్ చెప్పారు. స్పీకర్ విదేశాల్లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చి త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో నంగా నాచ్‌గా వ్యవహరించే తీరు పెరిగిందని, దానిని ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా మహారాష్ట్ర పేరు బద్నాం అవుతున్నదని, దానిని ఆపాలని కోరారు. అప్పటి గవర్నర్ చట్టవిరుద్ధమైన నిర్ణయంతో ఉద్దవ్ ఠాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ తగిలి, ఏక్‌నాథ్ షిండేవర్గం లబ్ధి పొందినప్పటికీ, షిండే ముఖ్యమంత్రి పదవీ వీడాలని తాము చెప్పలేమని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.