జోకుడుగాళ్లు, చెంచాగాళ్లకే విలువ.. బీఆరెస్ సమావేశంలో కార్యకర్త ఆవేదన
పార్టీలో నిబద్ధతగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు.. చెంచాగాళ్ళకే విలువ ఇచ్చార అంటూ పార్టీ కార్యకర్త శ్యామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- ఉద్యమకారులకు గుర్తింపు ఎక్కడిది?
- పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు
- ఎమ్మెల్యేలను మేమే గెలిపించుకోవాలి..
- మాకేదైనా అవసరం ఉంటే వారిని బతిమాలుకోవాలా?
- కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో శ్యామ్ ఫైర్
Karimnagar | విధాత బ్యూరో, కరీంనగర్ : ‘పార్టీలో నిబద్ధతగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు.. చెంచాగాళ్ళకే విలువ ఇచ్చారు.. అందుకే పార్టీ ఇట్ల పాడైంది..’ అంటూ పార్టీ కార్యకర్త శ్యామ్.. నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్‌లో బీఆరెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పార్టీ కార్యకర్త కామారపు శ్యామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఊహించని రీతిలో ఓ పార్టీ కార్యకర్త స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో, నేతలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయనను సముదాయించేందుకు అటు పార్టీ నేతలు, ఇటు ఇతర కార్యకర్తలు ప్రయత్నించారు.
‘బీఆరెస్‌లో కార్యకర్తలకు విలువలేదు.. వారిని పట్టించుకున్న నాయకుడే లేడు.. కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది’ అంటూ శ్యామ్ మండిపడ్డారు. ‘నేను తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుండి పార్టీలో, ఉద్యమంలో కొనసాగా. నాపై కేసులు కూడా ఉన్నాయి.. విచారణ చేసుకోండి’ అంటూ నాయకత్వానికి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించగానే ఎంపీ అభ్యర్థి గెలుపు కోసమే ఈ సమావేశాలు, ఈ ఆర్భాటాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తాము పనిచేస్తామంటే, కనీసం పని అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్లు చెప్తేనే వార్డుల్లోని ఓట్లన్నీ పడతాయా? అంటూ ఆయన స్థానిక శాసనసభ్యుడిని నిలదీశారు. ‘నాయకులు, ప్రతి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి.. పార్టీలోకి నిన్న మొన్న వచ్చినవాళ్లు రాజకీయాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దళితులను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ‘పార్టీ కోసం మేము అభ్యర్థుల్ని గెలిపించాలి.. ఆ తరువాత వారిని బతిమాలుకోవాలా? అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం కార్యకర్తల పట్ల అనుసరిస్తున్న తీరు దౌర్జన్యకరంగా ఉందని విమర్శించారు.