Siddaramaiah | కర్ణాటక తదుపరి సీఎం సిద్ధరామయ్యేనా?
Siddaramaiah | విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 36 ఏళ్ల చరిత్రను తిరగరాసి 135 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకున్నది. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు అన్న చర్చ ఎన్నికల ప్రచారంలోనూ, ప్రీపోల్స్, ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన సందర్భంలోనూ.. నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత నుంచీ జరుగుతున్నది. సీఎం సీటు కోసం ప్రధానంగా మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మధ్యే తీవ్రమైన పోటీ ఉన్నది. కాంగ్రెస్ […]

Siddaramaiah |
విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 36 ఏళ్ల చరిత్రను తిరగరాసి 135 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకున్నది. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు అన్న చర్చ ఎన్నికల ప్రచారంలోనూ, ప్రీపోల్స్, ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన సందర్భంలోనూ.. నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత నుంచీ జరుగుతున్నది.
సీఎం సీటు కోసం ప్రధానంగా మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మధ్యే తీవ్రమైన పోటీ ఉన్నది. కాంగ్రెస్ అధిష్ఠానం వీరిద్దరిలో ఎవరికీ సీటు కట్టబెడుతుంది? సాయంత్రం సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదనే ఆసక్తి నెలకొన్నది.
అయితే అధిష్ఠానం అండదండలు పుష్కలంగా ఉన్న డీకే వైపు మొగ్గుచూపుతుందా? అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యకే మరోసారి అవకాశం ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సీఎల్పీ సమావేశానికి ముందే డీకే చేసిన వ్యాఖ్యలు సిద్ధరామయ్యే కర్ణాటక కాబోయ సీఎం అనే సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తున్నది.
డీకే మాట్లాడుతూ..’సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశాను. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సిద్ధరామయ్యకు అన్నివిధాలా సహకరిస్తాను’ తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన మరోసారి త్యాగానికి సిద్ధపడినట్టుగానే భావించాలి. ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు హోం వంటి కీలక బాధ్యతలు కూడా అప్పగించవచ్చు.
అలాగే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఏమైనా హామీ ఇచ్చిందా? అన్నది సీఎల్పీ భేటీ అనంతరం తేలుతుంది. ఎలాగూ ఈ ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. డీకేను పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవచ్చు. అలాగే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల గెలపించే బాధ్యతను కూడా డీకేకు అప్పగించవచ్చు. ప్రస్తుతం అక్కడ బీజేపీ 25 సీట్లున్నాయి.
మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరోకటి జేడీఎస్‌కు, అంబరీశ్ మృతి తర్వాత ఆయన సతీమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక విజయం కాంగ్రెస్ పార్టీకి బాటలు వేస్తుందని నేతలు చెప్పినట్టుగానే ఆ దిశగా కార్యచరణ రూపొందించి ఆ బాధ్యతలు డీకేకు పార్టీ అధిష్ఠానం అప్పగించవచ్చు.
వయోభారం, సీఎంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెర్చవేర్చడం వంటి బాధ్యతలతో సిద్ధరామయ్య బిజీగా ఉంటారు .కాబట్టి పార్టీని లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేసి, కర్ణాటకతో పాటు ఇతర తెలంగాణ రాష్ట్రం లేదా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార, పర్యవేక్షణ బాధ్యతలు డీకేకు కట్టబెట్టవచ్చు. ఏమైనా అనివార్య పరిస్థితులు తలెత్తిత్తే తప్పా కర్ణాటక తదుపరి సీఎం సిద్ధరామయ్యే అని డీకే వ్యాఖ్యలను బట్టి అంచనా వేయవచ్చు.