Singer Mangli | జానపద గీతాలతో ఫేమస్ అయిన మంగ్లీ.. ఆ తర్వాత తెలంగాణ బొనాల పాటలతో మరింత పాపులరిటీ సంపాదించుకుంది. అంతే కాదు.. ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. సినీ ఇండస్ట్రీకి చేరింది. యువతను ఉర్రూతలూగించేలా చాలా సినిమాల్లో పాటలు పాడుతూ, అశేష అభిమానులను సంపాదించుకున్నది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నో గీతాలు ఆలపించి, ఆ పార్టీ కార్యకర్తలు, ఏపీ ప్రజల్లో జోష్ నింపింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా పాడిన పాటలు.. ఆ పార్టీ గెలుపునకు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగర్ మంగ్లీకి కీలక బాధ్యతలు కట్టెబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగ్లీ(సత్యవతి రాథోడ్) స్వస్థలం.. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని బసినేపల్లె తాండ.
ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఆమెకు నెలకు రూ. లక్ష చొప్పున జీతం ఇవ్వనున్నారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత యాంకర్‌గా జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.
కాగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి వరించింది.