విధాత: చాణక్య, మనస్సాక్షి.. సీ ఓటర్ ఇంకా బోలెడు టీవీ ఛానెళ్లు, పత్రికలు చేస్తున్న సర్వేలతోనే జనం గందరగోళం అయిపోతున్న తరుణంలో ఏపీకి ఇంకో కొత్త సర్వేయర్ వచ్చారు. ఈసారి జగన్‌కు పది లోపు సీట్లేనని తేల్చి పారేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి మొన్నటి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్‌తో బాటు పాదయాత్రలో అడుగులు కలిపారు. ఆయన తాజాగా ఒక సర్వే వివరాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే అది కూడా గొప్పే అన్నారు.
అంటే వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని డీఎల్ చెప్పడం గమనార్హం. డీఎల్ మీడియాతో మాట్లాడుతూ జగన్ని అతి పెద్ద అవినీతిపరుడిగా విమర్శించారు. జగన్ వైఎస్సార్ కుమారుడిగా తాము వేరేగా చూశామని అయితే ఆయన అంత అవినీతి పరుడు మరొకరు లేరని డీఎల్ విమర్శలు గుప్పించారు. ఇక ఏపీని వైసీపీ సర్వనాశనం చేసిందని ఆయన దుయ్యబెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీని కాపాడాలంటే అది ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యమని కూడా డీఎల్ చెప్పారు.
మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని అన్నారు. అయితే జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని అనుకుంటున్నానన్నారు. ఆ పార్టీలు కలసి పోటీ చేస్తే ఏపీలో వైసీపీకి ఒంటరి సంఖ్యలొనే సీట్లు వస్తాయని అది కూడా గొప్పే అని ఆయన అన్నారు.
ఇక వైఎస్ వివేకా కేసు విచారణ జనవరి 3 నుంచి జరగనుందని దాంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతుందని డీఎల్ అంటున్నారు. కడప జిల్లా మైదుకూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సమకాలికుడైన ఈయన్ను జగన్ జస్ట్ పార్టీలో చేర్చుకుని అలా ఉంచారు తప్ప ఎక్కడా ఎలాంటి పోస్టులూ ఇవ్వలేదు.
కనీసం పార్టీలో ఉనికి కూడా ఉన్నట్లు లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన తనను జగన్ పూర్తిగా ఇగ్నోర్ చేయడాన్ని తట్టుకోలేక సర్వేల పేరుతో డీఎల్ ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.