విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. చాలా చోట్ల లీడర్లు, క్యాడర్ అన్నదానాలు, కేక్ కటింగులు చేపట్టారు. క్రీడా పోటీలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన తల్లి వైఎస్ విజయమ్మ చిన్నమ్మ స్వర్ణలత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హాజరై దీవించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరకూ ఇటు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరి ఇంతమంది గ్రీట్ చేసినా ఒకే ఒక్క లోటుగా ఉంది. అదే జగన్ ఏకైక చెల్లెలు అయిన వైఎస్ షర్మిల తన అన్న పుట్టిన రోజు వేళ గ్రీట్ చేయకపోవడం మాత్రం కొట్టొచ్చినట్లుగానే కనిపించింది అని అంటున్నారు. జగన్ నివాసంలో తల్లి పినతల్లి బాబాయ్ అంతా ఉన్నా ఆ గ్రూప్ ఫోటోలో ఉండాల్సిన చెల్లెలు షర్మిల కనిపించకపోవడం మాత్రం వెలితిగానే ఉంది అంటున్నారు.
వాస్తవానికి రాఖీ పండగ సందర్భంలోనూ జగన్ కు చెల్లి రాఖీ కట్టే ఫోటోలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు చెల్లెలు కనిపించకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 17న షర్మిల పుట్టినరోజు జరిగింది. ఆ రోజున మంత్రి రోజా, మరి కొందరు షర్మిలకు గ్రీట్ చేసినా జగన్ నుంచి ట్వీట్ లేదని అనుకున్నారు.
బహుశా ఆ కారణం వల్ల కూడా అన్న పుట్టిన రోజుకు షర్మిల గ్రీట్ చేయలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా అన్నాచెల్లెళ్ళ మధ్య విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయా అన్నది మాత్రం బర్త్ డే సాక్షిగా మరోసారి చర్చకు తావిచ్చినట్లు అయింది అంటున్నారు.