విధాత: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులు చెప్పిన వివరాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరు బైటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీ జనార్ధన సంతోష్(బీఎల్ సంతోష్)కు సిట్ నోటీసు జారీ చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు.
బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన లాయర్ శ్రీనివాస్‌కు జారీ చేసిన సిట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తున్నదని ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసుకు సంబంధం లేనివారికి నోటీసులిచ్చి ఇరికిస్తున్నారని పిటిషనర్ తెలిపాడు. ఈ సందర్భంగా బీఎల్ సంతోష్, అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసినట్లు బయటపడింది.
ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిట్ ఆఫీసులో హాజరుకావాల్సిందిగా బీఎల్ సంతోష్‌కు సిట్ సూచించింది. దర్యాప్తునకు హాజరు కాకపోతే 41ఏ(3), (4) సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో ప్రస్తావించారు.
కోర్టులో చుక్కెదురు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై హైకోర్టులో విచారణ జరిగింది. బీ.ఎల్. సంతోష్, శ్రీనివాస్‌కు నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ కోర్టును కోరగా హైకోర్టు నిరాకరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సంతోష్‌ను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది.
నోటీసులు నేరుగా ఇచ్చేందుకు సహకరించేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని సిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.