దేశంలో కొవిడ్‌తో ఆరుగురు మృతి.. కొత్త కేసులు 702
కొవిడ్ మెల్లమెల్లగా పెరుగుతున్నది. గురువారం కొత్తగా 702 కేసులు రికార్డయ్యాయి.

యాక్టివ్ కేసుల సంఖ్య 4,097
విధాత: దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కొవిడ్‌తో ఆరుగురు మరణించారు. ఒకే రోజు 702 కొవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఆరు కొత్త మరణాల్లో మహారాష్ట్ర నుంచి రెండు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
డిసెంబర్ ఐదు నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. వాతావరణంలో మార్పు, చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. డిసెంబర్ 22న దేశంలో 752 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 ప్రారంభంలో మొదలైప కొవిడ్ మహమ్మారి గరిష్ఠ స్థాయికి చేరింది. రోజువారీగా కరోనా కేసులు లక్షల్లో నమోదయ్యాయి. 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నాలుగున్నరేండ్లలో సుమారు 5.3 లక్షల మంది మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం..కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చారు.
డిసెంబర్ 26 నాటికి దేశంలో మొత్తం 109 JN.1 కోవిడ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లో 36, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్, తమిళనాడులో 4 చొప్పున, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సాక్ష్యాధారాల ఆధారంగా JN.1 వల్ల కలిగే మొత్తం ప్రమాదం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.