స‌రిహ‌ద్దులో 3 కోట్ల బంగారం సీజ్‌

భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తాదళం స్మ‌గ్లింగ్‌ను అడ్డుకున్న‌ది. భార‌త్‌-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులో స్మ‌గ్లింగ్ చేస్తున్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న‌ది.

స‌రిహ‌ద్దులో 3 కోట్ల బంగారం సీజ్‌
  • భార‌త్‌-బంగ్లాదేశ్ బార్డ‌ర్‌లో ఒక‌రి అరెస్టు
  • భారీ స్మ‌గ్లింగ్‌ను అడ్డుకున్న బీఎస్ఎఫ్‌


విధాత‌: భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా దళం భారీ స్మ‌గ్లింగ్‌ను అడ్డుకున్న‌ది. భార‌త్‌-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు మీదుగా ఆదివారం పెద్దమొత్తంలో బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న భార‌త్‌కు చెందిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న‌ది. అత‌డి నుంచి రూ.3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న‌ది. రెండు బంగారం బ్రిక్స్‌, 30 బిస్కెట్ల‌ను సీజ్‌చేసింది. బీఎస్ఎఫ్ అధికారుల వివ‌రాల ప్ర‌కారం..


భార‌త్‌-బంగ్లా స‌రిహ‌ద్దులోని అంగ్ర‌యిల్ ఔట్‌పోస్టు వ‌ద్ద బీఎస్ఎఫ్-5వ బెటాలియ‌న్ సిబ్బంది విధుల్లో భాగంగా గ‌స్తీ నిర్వ‌హిస్తుండ‌గా, ఇచ్చామ‌తి న‌ది ఒడ్డు నుంచి చెట్ల పొద‌లు, వెదురు చెట్ల మాటుగా ఒక‌రో ఇండియాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశిస్తున్న‌ట్టు గ‌మ‌నించారు. ఏదో మూటను భుజం మోసుకొని ఓ వ్య‌క్తి స‌మీప గ్రామంలోకి ప్ర‌వేశిస్తున్న‌ట్టు గ‌మ‌నించారు. బ‌ల‌గాల‌ను గ‌మ‌నించిన స్మ‌గ్ల‌ర్ పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా, ఛేజ్‌చేసి సిబ్బంది ప‌ట్టుకున్నారు.


నిందితుడిని ప‌శ్చిమ‌బెంగాల్‌లోని 24 ప‌ర‌గ‌ణాల‌ జిల్లాలోని హ‌ల్దార్‌పారా గ్రామానికి చెందిన ప్ర‌సేన్‌జిత్ మండ‌ల్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అత‌డి నుంచి 4.829 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.3.10 కోట్లు ఉంటుంద‌ని బీఎస్ ఎఫ్ అధికారి వెల్ల‌డించారు. ప‌ట్టుకున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారుల‌కు అప్ప‌గించారు.


నిందితుడు విచార‌ణలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన‌ట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి స‌రిహ‌ద్దు దాటి ఇటీవల త‌న వ‌ద్ద‌కు ఓ స్మ‌గ్ల‌ర్ వ‌చ్చాడ‌ని నిందితుడు తెలిపాడు. ఇచ్చామ‌తి న‌ది ఒడ్డున త‌న‌కు ఒక మూట ఇచ్చాడ‌ని, దానిని తీసుకొస్తుండ‌గా, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌ట్టుకున్నాయ‌ని చెప్పాడు. అలా గ్రామానికి బంగారం మూట తీసుకొచ్చి అప్ప‌గిస్తే ఒక రోజు కూలిగా రూ.500 ఇస్తార‌ని తెలిపాడు. ఇలా ఎవ‌రైనా స్మ‌గ్లింగ్ చేయాల‌ని వ‌స్తే హెల్ప్‌లైన్ నంబ‌ర్ 14419కు ఫోన్‌చేయాల‌ని బీఎస్ఎఫ్ అధికారి స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌ల‌కు సూచించారు.