విధాత: సెలవుపై ఇంటికి వచ్చిన ఆర్మీజవాన్ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన దవాఖానకు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మార్గువ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ వినోద్ భాస్కర్ (35)
ఆదివారం మధ్యాహ్నం పొరుగు గ్రామమైన బిరవు గ్రామస్థులతో ఆదివారం క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో ఆట ఆడుతూ ఛాతిలో నొప్పి వస్తున్నదని చెప్పాడు. అతడి అన్న జగదీశ్ భాస్కర్ హుటాహుటిన తమ్ముడిని సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి వినోద్ భాస్కర్ గుండెపోటుతో మరణించాడని జిల్లా దవాఖాన డాక్టర్ యోగేశ్ యాదవ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఆర్మీ జవాన్‌గా వినోద్ భాస్కర్ పనిచేసేవాడు. ఇటీవలే సెలవుపై స్వగ్రామానికి వచ్చిన వినోద్ భాస్కర్.. ఫిబ్రవరి మొదటివారంలో తిరిగి విధుల్లో చేరాల్సి ఉన్నది. ఇంతలోనే గుండెపోటు చనిపోవడంతో ఆర్మీజవాన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.