యాదగిరిగుట్ట: ఘనంగా శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవం

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపై కొలువైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ స్మార్తాగమ శాస్త్రానుసారం లోక కళ్యాణ కారకులు ఆది దంపతులైన శ్రీపార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళాతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. లోక కళ్యాణార్ధం తారకాసురాది రాక్షసులను సంహరించుటకు దేవతల ప్రార్ధన మేరకు పార్వతీదేవి కఠినమైన తపస్సును ఆచరించి శివానుగ్రహం పొంది శివుని […]

  • Publish Date - February 17, 2023 / 04:53 PM IST

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపై కొలువైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ స్మార్తాగమ శాస్త్రానుసారం లోక కళ్యాణ కారకులు ఆది దంపతులైన శ్రీపార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళాతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు.

లోక కళ్యాణార్ధం తారకాసురాది రాక్షసులను సంహరించుటకు దేవతల ప్రార్ధన మేరకు పార్వతీదేవి కఠినమైన తపస్సును ఆచరించి శివానుగ్రహం పొంది శివుని పరిణయమాడిన తీరు శివపురాణాల్లో అద్భుత ఘట్టం నిలిచింది. ప్రకృతి పురుషుల సమన్వ‌యాన్ని దర్శించడమే శివపార్వతుల కళ్యాణ పరమార్థం. సప్త ఋషులు, ప్రమాదగణములు, ముక్కోటి దేవతలు సమస్త దేవగణం దర్శించి తరించే శివపార్వతుల కల్యాణోత్సవ వేడుక ఆద్యంతం భక్తులను పరవశింప చేసింది.

మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి అభిషేకములు, రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకములు నిర్వహించేందుకు దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన , రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు.

ఘనంగా ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో యాదగిరీషుడి సన్నిధిలో కొలువుతీరిన శ్రీ ఆండాలమ్మ వారి ఊంజల్ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువ జామున స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి, వేదమంత్ర పఠనాలతో నిజాభిషేకము, నిత్యార్చనలు నిర్వహించారు. ప్రాకార మండపంలో హోమము, నిత్య కల్యాణ వేడుకలు ఆగమశాస్త్ర రీతిలో వైభవంగా సాగాయి.

సాయంత్రం కొండపైన ప్రధాన ఆలయంలో, అనుబంధ పాత గుట్ట ఆలయంలో కొలువైన శ్రీ ఆండాల్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళా భక్తులు మంగళ నీరాజనాలు పలికారు.