కోటాలో మ‌రొక విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌… 28కి చేరిన మ‌ర‌ణాలు

పోటీ ప‌రీక్ష‌ల శిక్ష‌ణ‌కు ప్ర‌ధాన న‌గ‌ర‌మైన రాజ‌స్థాన్‌లోని కోటా (Kota) లో మ‌రొక విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. మృతుణ్ని ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు.

కోటాలో మ‌రొక విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌… 28కి చేరిన మ‌ర‌ణాలు

విధాత‌: పోటీ ప‌రీక్ష‌ల శిక్ష‌ణ‌కు ప్ర‌ధాన న‌గ‌ర‌మైన రాజ‌స్థాన్‌లోని కోటా (Kota) లో మ‌రొక విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. మృతుణ్ని ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌తో క‌లిపి కోటాలో ఈ ఏడాది ఆత్మ‌హ‌త్య చేసుకున్న అభ్య‌ర్థుల సంఖ్య 28కి చేరింది. బెంగాల్‌కు చెందిన ఫోరిద్‌.. కోటాలోని వక్ఫ్ న‌గ‌ర్‌లో ఉంటూ నీట్‌కు కోచింగ్ తీసుకుంటున్నాడు.అయితే సోమ‌వారం సాయంత్రం అత‌డు త‌న గ‌దిలో ఉరికి వేళ్లాడుతూ క‌నిపించాడ‌ని పోలీసులు తెలిపారు.


ఫ‌రీద్‌ సాయంత్రం 4:00 గంట‌ల నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని.. 7:00 వ‌ర‌కు చూసి ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని తోటి విద్యార్థులు తెలిపారు. రూం య‌జ‌మానికి ఫోన్ చేయ‌డంతో ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మృతుడి వ‌ద్ద ఎటువంటి సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేద‌ని.. ఘ‌ట‌న గురించి అత‌డి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చామ‌ని పోలీసులు తెలిపారు.


ఫ‌రీద్ గ‌త ఏడాది నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడ‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలో ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించ‌డానికి పోలీసులు ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. కోచింగ్ సంస్థల నిర్వాహ‌కులు, ఫ్యాక‌ల్టీతో నిరంత‌రం ట‌చ్‌లో ఉండ‌టం, హాస్ట‌ళ్లో ఫ్యాన్ల‌కు ఉరి వేసుకోవ‌డానికి లేకుండా స్ప్రింగ్‌లు ఏర్పాటు చేయ‌డం, ఒత్తిడిలో ఉన్న అభ్య‌ర్థుల‌ను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వ‌డం వంటివి చేస్తున్నారు.