Manchirevula |
విధాత: రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్‌కు కేటాయించిన రూ.10 వేల కోట్ల విలువైన 143 ఎకరాల భూమికి కబ్జాదారుల నుంచి సుప్రీం కోర్టు విముక్తి కలిగించింది. పదవీ విరమణ తరువాత రాజకీయాల్లోకి వెళ్లిన ఆంధ్రాకు చెందిన ఒక మాజీ పోలీస్ అధికారే ఈ భూమిపై కన్నేసి, రాష్ట్ర ప్రభుత్వం సొంత శాఖకు కేటాయించిన భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేశాడు. కానీ.. ఈ భూమిని కైవసం చేసుకోవడానికి చేసిన కుట్రలను రాజేంద్రనగర్ ఆర్టీఓగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ తిప్పి కొట్టారు.
ఈ కేసులో ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్స్ సీఎస్ విద్యానాథన్, వీ గిరి, పాల్వాయి వెంకట్ రెడ్డి, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. గ్రే హౌండ్స్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ నారాయణ స్వామి హాజరయ్యారు. అత్యంత విలువైన ఈ స్థలాన్ని కాపాడేందుకు కలెక్టర్ హరీష్, అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీవో కే చంద్రకళ, తహశీల్దార్ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ నవీన్ కృషి చేశారు.
ఆర్డీఓగా పని చేసిన చంద్రకళ ఈ భూమికి సంబంధించిన పాత రికార్టులన్నింటినీ బయటకు తీసి ఆధారాలతో సహా న్యాయస్థానికి అందించారు. దీంతో కబ్జాదారుల ఆటలు సాగలేదు. దశాబ్ద కాలంగా దందాలకు చెక్ పడింది. చిత్తశుద్ధితో పని చేసిన డిప్యూటీ కలెక్టర్ చంద్రకళను ప్రభుత్వం ప్రశంసిస్తోంది.
భూముల విలువలు పెరగడంతో రియల్టర్లు, అక్రమార్కులు రంగంలోకి దిగి అసైన్డ్ భూములను జీపీఏ చేయించుకున్నామంటూ హల్‌చల్ చేశారు. పూర్వపు రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుకు అనుకూలంగా లేని భూములకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకొంటే ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు సాగుకు అనుకూలంగా లేవని, ఆ అసైనీలను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఆ భూమినే ప్రభుత్వం పోలీసు గ్రేహౌండ్స్ విభాగానికి కేటాయించింది. ఆ తర్వాత అసైన్ దారులు, జీపీఏ హోల్డర్లు భూ కేటాయింపులు రద్దు చేయడాన్ని సవాల్చేస్తూ అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ సుప్రీం కోర్టు గ్రేహౌండ్స్కు కేటాయించిన సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న 142.39 ఎకరాల భూమి భూములపై ప్రైవేటు వ్యక్తులకు, జీపీఏ హోల్డర్లకు హక్కుల్లేవని స్పష్టం చేసింది.
1989లోనే 183 ఎకరాలను గ్రేహౌండ్స్‌కు కేటాయించారు. ఆ తరువాత మరోసారి 2003 జూన్ మూడో తేదీన మంచిరేవులలో సర్వే నం.393 లోని 183.29 ఎకరాలను గ్రే హౌండ్స్‌కు పంచనామా చేసి అప్పగించారు. మొదటి సారి కేటాయించినప్పటి నుంచే ఈ భూమి గ్రేహౌండ్స్ ఆధీనంలో ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రే హౌండ్స్‌కు కేటాయించిన 8 ఏళ్ల తరువాత కొంత మంది 1997లో ఈ అసైన్ మెంట్భూములకు జీపీఏ హోల్డర్లమంటూ రంగంలోకి దిగారు. కలెక్టర్ ఉత్తర్వులను ప్రశ్నించారు. అనేక కేసులు నడిచాయి. ఈ భూములకు తాను జీపీఏ హోల్డర్ నంటూ అల్లా బక్ష్ అనే వ్యక్తి వచ్చి డాక్యుమెంట్ నెం.1518/ 1991 ప్రకారం తనకు అధికారాలు కట్టబెట్టారనిచెప్పుకొని 71మందికి అమ్మేశారు.
వాటి ఆధారంగానే కొందరు ఆంధ్రా లీడర్లు, రియల్టర్లు, డెవలపర్స్ రంగప్రవేశం చేసి, భూమిని కొట్టేసే ప్రయత్నాలు చేశారు. దీంతో ప్రభుత్వం అసైన్‌మెంట్ యాక్ట్,1977 కింద ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమార్కులు ప్రభుత్వాన్ని సవాల్‌చేశారు.
ఈకేసు వివిధ కోర్టులలో 20 ఏళ్ల పాటు విచారణ జరిగింది. చివరకు సర్వోన్నత న్యాస్థానం కబ్జాదారులు వేసిన పిటిషన్‌ను డిస్‌మిస్ చేస్తూ.. మంచిరేవుల భూమి విషయంలో ఏ సివిల్ కోర్టు లేదా హైకోర్టు గానీ జోక్యం చేసుకోరాదని వెల్లడించింది. సుప్రీం తీర్పుతో ఈ భూమి ప్రభుత్వపరమైంది