విధాత: ఆంధ్ర ప్రాంతం మాచర్ల నుంచి హైదరాబాద్‌కు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు శక్తి తనిగై రాజను అరెస్టు చేసి అతని నుంచి 55 లక్షల విలువైన 284 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీ లో భాగంగా TN-74-AV-6800 గల హుందాయి వెర్నా కారును అపి తనిఖీ చేయగా అందులో ఉన్న వ్యక్తి శక్తి తనిగైరాజ నుంచి 142 గంజాయి పాకెట్లను ఒక్కొక్కటి 2 కిలోలు మొత్తం 284 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితుడిని అరెస్టు చేసి విచారించగా అతను తెలిపిన వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రంలోని శక్తి ఇల్లామ్ పెరియార్ నగర్‌కు చెందిన శక్తితనిగైరాజ(43) ఆంధ్రా ప్రాంతలోని రాజమండ్రి దగ్గర నర్శిపట్నం వాసులైన వీరబాబు, కృష్ణల వద్ద నుంచి ఒక్కొక్కటి 2 కిలోలు తూకం గల 142 గంజాయి పాకెట్లను తక్కువ ధరకు తీసుకొని తమ రాష్ట్రం నందు ఎక్కువ ధరకి అమ్ముకోవాలనే ఉద్దేశంతో కారులో పెట్టుకొని రాజమండ్రి నుంచి తమిళనాడు బయలుదేరాడు.
బోలపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్లిప్ ఇచ్చి టోల్ గేట్‌ను ఢీకొట్టి టోల్‌గేట్‌ను దాటుకుని తన వాహనాన్ని దారి మళ్లించి మాచర్ల మీదుగా నాగార్జునసాగర్‌లోకి ప్రవేశించాడు.
అప్రమత్తమైన నాగార్జున సాగర్ పోలీసులు నాగార్జుననగర్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు 20 నిమిషాల పాటు వెంబడించి పెద్దవూర వద్ద పట్టుకుని, అతని నుంచి 142 గంజాయి పాకెట్లతో పాటు ఒక కారు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ డియస్పి వెంకటగిరి, సిఐ నాగరాజు, పెద్దవూర పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ పరమేష్, హెచ్‌సి కె.శంకర్‌బాబు. పిసి కిషన్, హెచ్‌జి మట్టయ్యలను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.