Swaroopanandendra Saraswati
విధాత: ఏమైందో ఏమో.. భయపడ్డారా.. భయపెట్టారా తెలీదు. స్వరూపానందేంద్ర స్వామి మాట మార్చారు. నా ఉద్దేశ్యం అది కాదు. నేను వేరేలా అన్నాను అంటూ తిరగమోత వేశారు. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం ఇంత ఘోరంగా.. అత్యంత నాసిరకంగా జరగడం నా జన్మలోనే చూడలేదు అంటూ ప్రభుత్వం మీద ఘాటు కామెంట్లు చేసిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి (Swaroopanandendra Saraswati) ఇప్పుడు అచ్చా.. ఆలా కాదు.. నా ఉద్దేశ్యం అది కాదు.. అంటూ నాలుక మడతేశారు.
ఏటా జరిగే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన క్రతువు శనివారం జరిగింది. దీనికి వేలల్లో భక్తులు వచ్చారు.. అయితే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సింహాచలం ఆలయ అధికారులు ఇష్టానుసారం పని చేసారని, భక్తులు గంటల కొద్దీ లైనులో ఉండిపోగా వీఐపీలు కూడా చాలాసేపు అంతరాలయం .. గర్భ గుడిలో గడిపారని వార్తలు వచ్చాయి.
దీనిమీద స్వరూపానందేంద్ర స్వామిజి కూడా గట్టిగానే మాట్లాడారు. సింహాద్రి అప్పన్న దర్శన అనంతరం ఆయన బయట మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారు. గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవు, నా జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యాను. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నా. కొండ కింద నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు.
భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి. భక్తుల ఇబ్బందుల మధ్య దైవ దర్శనం బాధ కలిగించింది. ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదు అన్నారు. వాస్తవానికి ఆయన ప్రభుత్వ పెద్దలకు, ఇంకా చెప్పాలనే నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు, జగన్ కూడా తరచూ ఈ పీఠానికి వచ్చి స్వామిజి ఆశీస్సులు తీసుకుంటారు. మరి అలంటి స్వామిజి ఇలా నేరుగా విమర్శలు చేయడంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చిందో, హెచ్చరించారో. బెదిరించారో తెలీదు కానీ మరునాడే స్వామిజి మాట మార్చారు.
నా ఉద్దేశ్యం అది కాదు.. ప్రభుత్వం బాగానే ఏర్పాట్లు చేసింది కానీ ఇక్కడి అధికారులు సరిగా వ్యవహరించలేదు.. అంతా గందరగోళం చేసేసారు.. ఇలా ఐతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది కదాని నా ఉద్దేశ్యం. అందుకే అలా అన్నాను.. నాకు వేరే ఉద్దేశ్యం లేదు అని వివరణ ఇచ్చుకున్నారు. స్వామిజి మళ్ళీ ఇలా ఎందుకు మాట మార్చారబ్బా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.