విధాత: విదేశాల్లో క్యాసినో నిర్వహణపై ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు దఫాలు పిలిపించి విచారించిన విషయం తెలిసిందే. మళ్లీ మూడు నెలల తర్వాత ఈ కేసులో కదలిక మొదలైంది. తాజాగా బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరుడు ధర్మేంద్రయాదవ్, మహేశ్ యాదవ్‌లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవ్వాళ మధ్యాహ్నం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో వీరిద్దరూ విచారణకు వచ్చారు.
ప్రవీణ్ విదేశాల్లో నిర్వహించిన క్యాసినోకు ధర్మేంద్ర, మహేశ్ తో పాటు మరికొందరు వెళ్లినట్లు ఈడీ అధికారుల తనఖీల్లో వెళ్లడయ్యింది. విదేశాల్లో క్యాసినో చట్టబద్ధమైనప్పటికీ భారతదేశంలో క్యాసినోకు అనుమతి లేదు. కాగా క్యాసినో ఆడేందుకు వీరు తీసుకెళ్లిన డబ్బులు, ఆర్థిక లావాదేవీల కోసం హవాలా విధానాన్ని అనుసరించినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది.
ఈ క్రమంలో నిబంధనలు పాటించారా లేదా అనేది ఆరా తీసేందుకు బుధవారం నుంచి మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టారు. వీరిద్దరితో పాటు మరికొందరు విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు వెళ్లినట్లు తెలిసింది. మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం. క్యాసినో వ్యవహారంలో సుమారు 30 మందికి ముందస్తు నోటీసులు పంపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతున్నది.
నేపాల్‌తో పాటు శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్ దేశాల్లో నిర్వహించిన క్యాసినోకు ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెళ్లడైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చీకోటి ప్రవీణ్‌కు వేయి మంది వరకు కస్టమర్లు ఉన్నట్లు తెలుస్తున్నది.