వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే : పవన్ కళ్యాణ్

వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే : పవన్ కళ్యాణ్

విధాత : వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వారాహి నాలుగో విడత యాత్రను కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభించిన పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని వైకాపా ప్రభుత్వాన్ని గద్ద దించడమే మా లక్ష్యమన్నారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని అంటున్నారని..ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు అని పవన్ అభివర్ణించారు.




రాష్ట్ర ప్రజలు సరైన వ్యక్తులను గెలిపించుకోకుంటే ఒక తరం నష్టపోతుందని ఇప్పటికైనా చైతన్యవంతంగా ఆలోచించి జగన్ ఓడించాలన్నారు. జగన్ ఇప్పటికే వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైందని అధికార మదంతో ఉన్న వైకాపా నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసన్నారు. రాష్ట్రంలో 30 వేలపై ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2018 నుంచి డీఎస్సీ ప్రకటన రాలేదన్నారు. డీఎస్సీ కోచింగ్‌కు అవనిగడ్డ ప్రధాన కేంద్రం అన్నారు. డిఎస్సీ వేస్తామని జగన్ హామీ ఇచ్చి ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. మేము వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామన్నారు.




సీఎం పదవీ వస్తే సంతోషంగా స్వీకరిస్తానని నాకు సీఎం సీటు కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ దేవుడు అనుకుని గెలిపించిన ప్రజల పాలిట దయ్యామై పీడిస్తున్నారన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందన్నారు. కృష్ణాజిల్లాలో 86 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, జిల్లా ప్రజలకు ఇంటింటికి అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న వైకాపా మహమ్మరికి జనసేన- టీడీపీ వ్యాక్సిన్ మందు అన్నారు.



మనల్ని కులాలుగా వేరు చేస్తున్నావారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కులం కంటే మానవత్వం గొప్పదని నేనెప్పుడూ ఎవరి కులం ఏమిటన్నది చూడలేదన్నారు. గుణమే చూసామని, ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభా, సామర్ధ్యం చూస్తామన్నారు. ఏపీ అభివృద్ధిని వైకాపా ఫ్యాన్ కు ఉరివేశారని, సైకిల్-గ్లాస్ కలిసి ఫ్యాన్ ను తరిమివేయడం ఖాయమన్నారు. ఫ్యాన్‌కు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదని, జగన్ పరిస్థితి ఓడిపోయే ముందు హిట్లర్ పరిస్థితి మాదిరిగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి 175 కాదు కదా 15 సీట్లు వస్తే చాలా గొప్ప అని పవన్ అన్నారు.



జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరం లేదన్నారు. ప్రజల కోసమే టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకుందన్నారు. జనసేన పదేళ్లలో అనేక ఎదురు దెబ్బలు తిందని, అయినా ఆశయాలు, విలువల కోసమే పార్టీ నడుపుతున్నామన్నారు. యువత,ని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ జనసేన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓట్లు చీలకుండా చూసేందుకు టీడీపీతో పొత్తు అనివార్యమైందన్నారు.