ఏపీలో టీడీపీ నిరసనల మోత.. బాబు అరెస్టుపై మోత మోగిద్దాం పేరుతో నిరసనలు

  • Publish Date - October 1, 2023 / 01:11 AM IST

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ పిలుపు మేరకు మోత మోగిద్దాం పేరుతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. విజిల్స్‌, డప్పులు, డోలు, కంచర్లు, గిన్నెలు, ప్లేట్లు, గంటలు వంటి వాటిని మోగిస్తూ రాత్రి 7గంటల నుంచి ఐదు నిమిషల పాటు తమ నిరసనలు వ్యక్తం చేశారు.



రాజమండ్రిలో నారా బ్రాహ్మణి మోత మోగిద్దాం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నారా భువనేశ్వరి కూడా డోలు కొట్టి నిరసన తెలిపారు. న్యూఢిల్లీలో నారా లోకేశ్, ఎంపీలు కె.రవీంద్రకుమార్, రఘురామకృష్ణంరాజు, రాంమోహన్ నాయుడు గంట కొట్టి నిరసన తెలిపారు. తెలంగాణలో బేంగపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు స్వయంగా డప్పుకొట్టి మోతమోగిద్దాం నిరసన చేపట్టారు.


YouTube video player

టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్టు చేయించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. మా నాయకుడు చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదని, అధికార మత్తు విదలేలా మోత మోగించడం ద్వారా నిరసన తెలిపామన్నారు.


న్యూఢిల్లీలో మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించిన నారా లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షతో చంద్రబాబుపైన అక్రమ కేసులు బనాయించి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతికార రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. తమ తప్పు లేనందునా తాము విచారణకు సహకరిస్తున్నామన్నారు. నాకు నోటీస్‌లు ఇవ్వడానికి ఢిల్లీకి వచ్చిన సీఐడీ బృందానికి కాఫీ, టీలు ఇచ్చి స్వాగతించామన్నారు. విచారణకు తాను హాజరుకాబోతున్నట్లుగా తెలిపారు. జగన్ మాదిరిగా తాను కేసులు, విచారణ వాయిదాలు కోరబోనని, జగన్ పదేళ్లుగా బెయిల్‌తోనే కొనసాగుతున్న విషయం మరువరాదన్నారు.


లంచాలు తిని కంచాలు మోగించడం ఎందుకు : విజయసాయి రెడ్డి సెటైర్లు


టీడీపీ పార్టీ మోతలు ఎందుకు..లంచాలు తీసుకుని కంచాలు కొట్టడం ఎందుకు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ మోత మోగిద్దాం నిరసనలపై సెటైర్లు వేశారు. అన్ని కోర్టులు వారి వాదనలు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఎవరి కోసం విజిల్స్‌, హారన్లు అంటు ఆయన మండిపడ్డారు.

YouTube video player